రేపు సారలమ్మ రాక..వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తజనం

నవతెలంగాణ – తాడ్వాయి 
అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన మేడారం వైభవంగా ప్రారంభమైంది. సమ్మక్క- సారలమ్మ ఆశీర్వాదాలు కోసం మేడారానికి భక్తులు క్యూ కడుతున్నారు. రేపు అనగా (21-02-2024) బుధవారం నాడు కన్నెపల్లి నుంచి సారలమ్మను, పూనగల్లు నుంచి పగిడిద్దరాజు ను, కొండాయి నుంచి గోవిందరాజు ను గద్దె ల పైకి తీసుకురానున్న నేపథ్యంలో… అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. జాతర పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వనదేవతలకు నిలువెత్తు బెల్లాన్ని (బంగారం) సమర్పిస్తున్నారు. ఉదయం నుంచి గుడిసెలు ఏర్పాటు చేసి ముంగిళ్ల వద్ద రంగవల్లులతో అందంగా అలంకరించారు. వన దేవతలకు బెల్లం, చీరే సారెలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు పూనకాలతో పరవశిస్తు అమ్మవార్ల దీవెనల కోసం  గద్దెల వద్దకు  చేరుకుంటున్నారు. మేడారం జనసందోహంతో ఆధ్యాత్మిక భక్తి భావనతో పులకించిపోతోంది. సుమారు రెండు గంటల సమయం పడుతుందని భక్తులు చెప్తున్నారు. మరో వైపు జాతరలో కొబ్బరికాయలు, బంగారం(బెల్లం), కొబ్బరికాయల ధరలు కొండెక్కాయని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
క్యూలైన్ల ద్వారా దర్శనం: నేడు బుధవారం సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు గద్దలపై చేరడానికి వస్తున్న క్రమంలో భక్తులు మంగళవారం లక్షలాదిగా తరలివచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్న కారణంగా జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఇలాంటి తొక్కిస్ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శనాలకు ఇబ్బంది జరగకుండా క్యూలైన్ల ద్వారా దర్శనాలు చేస్తున్నారు. దర్శనానికి ఇలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు పోలీస్ శాఖ చేపట్టింది.