– ప్రత్యేక అధ్యయనంగా హిందూత్వ
– ఢిల్లీ యూనివర్సిటీ నిర్ణయం
న్యూఢిల్లీ : ‘సారే జహా సే అచ్ఛా’ గీత రచయిత మహమ్మద్ అల్లమ ఇక్బాల్‌పై పాఠాన్ని సిలబస్ నుంచి తొలగించాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. బీఏ ఆరో సెమిస్టర్‌లో ‘మోడరన్ ఇండియన్ పొలిటికల్ థాట్’ అధ్యాయాన్ని తొలగించాలని విశ్వ విద్యాలయం అకడమిక్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఢిల్లీ యూనివర్శిటీ ఉప కులపతి ప్రొఫెసర్ యోగేశ్ సింగ్ మాట్లాడుతూ దేశ విభజనకు పునాది వేసినవారి గురించి సిలబస్‌లో ఉండకూడదన్నారు. 1,014వ అకడమిక్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి, ఇక్బాల్‌పై అధ్యాయాన్ని తొలగించాలని నిర్ణయించినట్టు తెలిపారు.అకడమిక్ కౌన్సిల్ మెంబర్ ఒకరు వార్తా సంస్థతో మాట్లాడుతూ ఢిల్లీ యూనివర్శిటీ ఉప కులపతి చేసిన ప్రతిపాదనను అకడమిక్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు తెలిపారు. అండర్‌గ్రాడ్యుయేట్ కరికులం ఫ్రేమ్‌వర్క్, 2022 క్రింద వివిధ కోర్సుల్లో 4వ, 5వ, 6వ సెమిస్టర్ల సిలబస్ కోసం ఈ సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలిపారు. డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్, తదితరుల గురించి బోధించాలని తెలిపారు. పొలిటికల్ సైన్స్ సిలబస్ నుంచి ఇక్బాల్‌పై పాఠాన్ని తొలగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. స్టాండింగ్ కమిటీ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.దేశ విభజన, హిందుత్వం, గిరిజనులపై అధ్యయనాలకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను కూడా ఆమోదించినట్లు తెలిపారు. దేశ విభజనపై అధ్యయనానికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఐదుగురు కౌన్సిల్ సభ్యులు వ్యతిరేకించినట్టు తెలిపారు.