చంపేస్తున్న ఒత్తిడి

Stress that kills– పెరుగుతున్న గుండెపోటు కేసులు: ఆందోళన కలిగిస్తున్న యువవైద్యుల మరణాలు
– జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న సీనియర్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
చికిత్స చేసి ప్రాణాలు పోయాల్సిన వృత్తి వారిది. కాని ఒత్తిడి సమస్య వారినే పొట్టన పెట్టుకుంటున్నది. వారిలో గుండెపోటుకు గురవుతున్న కేసులు పెరుగుతున్నాయి. హార్ట్‌ ఎటాక్‌లకు గురై మరణిస్తున్న యువ వైద్యులు, మెడికోలు ఎక్కువవుతుండంతో ఆ రంగంలో పని చేస్తున్న సీనియర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జూనియర్లకు సూచిస్తున్నారు. అంతర్లీనంగా ఈ వృత్తిలో ఉన్న ఒత్తిడి నిర్వహణలో విఫలం కావడమే ఇలాంటి పరిణామాలకు దారి తీస్తున్నదని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఇదే అభిప్రాయాన్ని పలువురు సీనియర్‌ డాక్టర్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒక ఏడాదిలో వైద్యేతర విద్యార్థుల్లో లక్ష మందిలో 12 మంది ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యల చేసుకుంటుంటే, ఈ వృత్తిలో ఉన్నవారు లక్షకు 30 మంది ఉండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నది.
ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కేరళ విభాగం 10 వేల మంది డాక్టర్లపై పదేండ్ల పాటు చేసిన అధ్యయనంలో కూడా ఇలాంటి ఫలితాలే వెల్లడయ్యాయి. అధ్యయన కాలంలో 289 మంది చనిపోగా అందులో 27 మంది గుండెకు సంబంధించిన ఇబ్బందితో ప్రాణాలొదిలారు. ఈ అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం వెల్లడైంది. కేరళలో సామాన్యులు సగటున 74 ఏండ్లు బతుకుతుండగా, డాక్టర్ల సగటు వయస్సు 62 కావడం గమనార్హం. ఇండియన్‌ కౌన్సిల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఉత్తర భారతదేశంలో 787 మంది మెడికల్‌ విద్యార్థులపై అధ్యయనం చేసి జర్నల్‌లో ప్రచురించింది. వీరిలో 37 శాతం మంది ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు చేయడం, 10 శాతం మంది ఎలా ఆత్మహత్య చేసుకోవాలనే ప్లాన్‌ వేసుకున్నట్టు, 3.3 శాతం మంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసినట్టు వెల్లడించింది. కరోనా సమయంలో ప్రజల్లో సంభవించిన ఆకస్మిక మరణాలపై కూడా ఐసీఎంఆర్‌ మరో పరిశోధన చేసింది. ఇలా మరణించిన వారిలో ఎక్కువగా చనిపోవడానికి 2 గంటల ముందు ఎక్కువగా మద్యం సేవించడం, డ్రగ్స్‌ తీసుకోవడం, గుండెకు సంబంధించిన ఇబ్బందులున్న కుటుంబ నేపథ్యం, అతి తీవ్రంగా వ్యాయామం చేయడం తదితర కారణాలున్నట్టు తేలింది.
చికిత్స చేసే వారికి చికిత్స అవసరమని ప్రజారోగ్య కమిటీ సూచించిందని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ రంగారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి డాక్టర్‌ హెల్త్‌ చెకప్‌ చేయించి డేటాబేస్‌ నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. ప్రతి ఐఎంఏ వైద్యునికి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం తక్షణావసరమని డాక్టర్‌ వెంకటరత్నం అభిప్రాయం వ్యక్తం చేశారు. తద్వారా హైరిస్క్‌ ఉన్న వారిని గుర్తించే వీలుంటుందని తెలిపారు. వత్తిలో రాణించి అందరిచేత ప్రముఖులు అనిపించుకునే తపనతో యువ వైద్యులు తమ ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం కనిపిస్తున్నదని డాక్టర్‌ సంతోష్‌ సీహెచ్‌ తెలిపారు. ప్రతి రోజు ఒకట్రెండు గంటలు తమ కోసం తాము ప్రత్యేకంగా కేటాయించుకోవాలని డాక్టర్‌ మహానంద చౌదరీ సూచించారు. తమ శక్తి మించిన విలాసవంతమైన వాటి కోసం రుణాలు తీసుకోవడం, విశ్రాంతి లేకుండా పని చేయడం కూడా ఇలాంటి విపరిణామాలకు దారి తీస్తున్నదని డాక్టర్‌ పెద్దినేని శ్రీకాంత్‌ తెలిపారు.
బ్యాలెన్స్‌ అవసరం – డాక్టర్‌ కిరణ్‌ మాదాల
తమ ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, వృత్తిని బ్యాలెన్స్‌ చేసుకోవాల్సిన అవసరముందని ఐఎంఏ రాష్ట్ర సైంటిఫిక్‌ కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ కిరణ్‌ మాదాల సూచించారు. వైద్య విద్యా ర్థులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. చదువు మొదలుకొని ఆలస్యంగా స్థిరపడటం, అనుకున్న స్థాయిలో సంపాదన లేకపోవడం తదితర కారణాలు ఒత్తిడిని పెంచు తున్నాయని చెప్పారు. కేవలం ర్యాంకుల ఆధారంగానే కాకుండా ప్రజల అవసరాలు, సమాజంలో డిమాండ్‌ మేరకు కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. గతంలో క్లినిక్‌లు నడిచేవని, కానీ మారిన పరిస్థితుల్లో వాటికి అంతగా రాబడి ఉండటం లేదనీ, దీన్ని దృష్టిలో ఉంచుకుని జీవనోపాధికి ఉన్న అవకాశాలను ఎంపిక చేసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.