కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

In Karimnagar A major fire hazard– కాలిబూడిదైన 50 పేదల గుడిసెలు
– మంటల ధాటికి పేలిన ఐదు గ్యాస్‌ సిలిండర్లు
– భయంతో పరుగులు తీసిన జనం
– గుడిసెవాసులంతా మేడారం వెళ్లడంతో తప్పిన ప్రాణనష్టం
– కనీస ఆనవాళ్లు లేకుండా బూడిదైన పేదలగూళ్లు
– కుటుంబానికి రూ.లక్ష సాయం, పక్కా ఇల్లు నిర్మించాలని ఎమ్మెల్యే గంగుల డిమాండ్‌
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి/కరీంనగర్‌ క్రైం
కరీం’నగరం’ నడిబొడ్డున మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుభాష్‌నగర్‌ నుంచి ఆదర్శనగర్‌కు వెళ్లే దారిలోని గుడిసెలకు మంటలు అంటుకోవడంతో.. అందులోని ఐదు వంటగ్యాస్‌ సిలిండర్లు భారీ శబ్ధాలతో పేలుడు సంభవించి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. భయంతో చుట్టుపక్కవాళ్లు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలకుపైగా శ్రమించి మంటలు అర్పారు. ఆ గుడిసెవాసులంతా మేడారం జాతరకు వెళ్లడంతో పెనుప్రమాదం తప్పినా.. అప్పటికే ఆనవాళ్లు లేకుండా గుడిసెలన్నీ కాలిబూడిదై రోడ్డున పడ్డారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ బాధిత కుటుంబాలకు రూ.లక్ష సాయం సహా పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నుంచి జగిత్యాలకు వెళ్లే రహదారి పక్కనే సుభాష్‌నగర్‌లో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులు పూరిళ్లు వేసుకుని సుమారు 50 కుటుంబాలు 20ఏండ్లుగా నివాసముంటున్నాయి. గుడిసె వాసులంతా కలిసి సమ్మక్కసారలమ్మ దర్శనం కోసం సోమవారమే మేడారానికి వెళ్లారు. మంగళవారం ఉదయం 11గంటల సమయంలో గుడిసెల నుంచి మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు మంటలా ర్పేందు ప్రయత్నిస్తుండగానే ఓ గుడిసెలోని వంటగ్యాస్‌ సిలిండర్‌ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా దవానంలా వ్యాపించిన మంటలు చుట్టూ ఉన్న సుమారు 50పూరిళ్లకు అంటుకు న్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకునేసరికే మరో వంటగ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఇలా వరుసగా మరో మూడు సిలిండర్లు పేలడంతో చుట్టుపక్కల జనమంతా పరుగులు తీశారు. అతికష్టం మీద అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పేశాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గుడిసెలు, అందులోని టీవీ, వంట, ఇతర సామాగ్రి బూడిదయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే సమ్మక్క-సారలమ్మ చిత్రపటాల ఎదుట పెట్టిన దీపాలు అంటుకోవడంతోనే అగ్నిప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న గుడిసెవాసులు సాయంత్రానికి అక్కడకు చేరుకున్నారు. ఆనవాళ్లు లేకుండా కాలిపోయిన తమ స్థావరాలను చూసి బోరున విలపించారు. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ బాధితులను ఓదార్చారు. బాధితులకు తక్షణమే రూ.లక్షసాయం ఇవ్వాలని, వారందరికీ పక్కా ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
రోడ్డునపడ్డ పేదలు వీరే..
గుడిసె వాసులందరూ మేడారం జాతరకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. అయినప్పటికీ గుడిసెలన్నీ కాలి బూడిదవడంతో నిలువ నీడ లేకుండా రోడ్డునపడ్డారు. సర్వం కోల్పోయిన బాధితుల్లో.. బత్తుల రాంబాబు, చల్లా తిరుమలయ్య, చల్లా రమేష్‌, గుంజ రమేష్‌, బత్తుల కృష్ణ, కుంచం తిరుమలేష్‌, వేముల రాములు, వేముల నాగరాజు, వేముల ఎల్లయ్య, అలకుంట నర్సయ్య, చల్లా వెంకటేష్‌, బత్తుల రాంప్రసాద్‌, గోగుల యాదయ్య, కుంచపు శివ, వేముల శ్రీను, ఓర్సు శ్రీను, వేముల ఉప్పలయ్య, గుర్రం కుమార్‌, వెంకన్న, మక్కల్ల శ్రీను, బత్తుల వెంకన్న, ఓర్సు కృష్ణ కుటుంబాలు ఉన్నాయి.
తక్షణసాయం రూ.2లక్షలు ఇవ్వాలి : మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ(ఎం) కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి
అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడిన కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే తక్షణసాయం కింద రూ.2లక్షలు ఇవ్వాలి. అగ్నిప్రమాదానికి గల కారణాలను నిగ్గుతేల్చాలి. వారికి వెంటనే పునరావాసం కల్పించి పక్కా ఇండ్లను నిర్మించి ఇవ్వాలి.