– ప్రస్తుతం 3 నుంచి 3.5 నిమిషాలకో మెట్రో రైలు
– జేబీఎస్-ఎంజీబీఎస్ రూట్లో 6 నిమిషాలకో రైలు
– మెట్రోలో ప్రతిరోజూ 5లక్షల మంది జర్నీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు వందలాది ఆర్టీసీ బస్సులను పంపించారు. నేటి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే సిటీ నుంచి దాదాపు 2వేలకుపైగా బస్సులు అవసరమైన పాయింట్లకు వెళ్లగా.. గ్రేటర్‌లో కేవలం 600 బస్సులే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులతోపాటు వివిధ వృత్తి పనుల కోసం వెళ్లేవారు బస్సుల్లేక అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి బస్టాపుల్లో బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే ప్రజలను ప్రత్యామ్నాయ రవాణా చూసుకోవాలని కోరింది. సమ్మక్క- సారలమ్మ మహాజాతరకు వెళ్లే సందర్శకులకు, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. బస్సుల సంఖ్య తగ్గడంతో మెట్రోలో రద్దీ పెరిగింది.
అవసరమైతే ట్రిప్పులు పెంచుతాం..
గ్రేటర్ జోన్‌లో ఆర్టీసీ రెగ్యులర్ సర్వీసులను తగ్గించడంతో ఆటోలు, క్యాబ్స్‌లు, ఇతర ప్యాసింజర్ వాహనదారులు, డ్రైవర్లు అడ్డగోలుగా ధరలు పెంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ జనం గమ్యస్థానాలకు చేరేందుకు హైదరాబాద్ మెట్రో రైలును ఆశ్రయించనున్నారు. ట్రాఫిక్ రహితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న మెట్రోకు ఆదరణ బాగుంది. ఆటోలు, బస్సులతో పోల్చితే నిమిషాల వ్యవధిలో, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా గమ్యస్థానాలకు వెళ్లే అవకాశం ఉండటంతో చాలామంది మెట్రోకే మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇప్పటికి హైదరాబాద్ మెట్రో అధికారులు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. కానీ, ప్రయాణికుల రద్దీ పెరిగితే ప్రస్తుతమున్న రైళ్ల ప్రీక్వెన్సీని పెంచుతామని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గ్ కారిడార్‌లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 3, 3.5 నిమిషాలకో ట్రైన్.. ఎంజీబీఎస్- జేబీఎస్ రూట్లో ఆరు నిమిషాలకో రైల్ నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. ఒకవేళ అవసరమైతే అప్పుడు రద్దీకి అనుగుణంగా 3నిమిషాలకో ట్రైన్ నడుపుతామని చెబుతున్నారు. ఎల్బీనగర్- మియాపూర్, నాగోలు- రాయదుర్గం, జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్ల పరిధిలోని 57 స్టేషన్ల ద్వారా రోజుకు 1,065 సర్వీసులను నడిపిస్తున్నారు. ప్రతిరోజూ 5-5.10లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. మంగళవారం కూడా ఇదే స్థాయిలో ప్రయాణికుల ఫుట్‌పాల్ నమోదైందని మెట్రో అధికారులు తెలిపారు.