మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ పి.గౌతమి

నవతెలంగాణ – వేములవాడ
రాజన్న ఆలయంలో వైభవంగా నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.గౌతమి ఆదేశించారు. బుధవారం ఆలయ అధికారులతో కలసి గుడి చెరువు పార్కింగ్ స్థలం, ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, పటిష్టమైన క్యూలైన్ల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పరిశీలనలో ఆలయ ఈఓ కృష్ణప్రసాద్, మున్సిపల్ కమీషనర్ అన్వేష్, ఆలయ ఈఈ రాజేష్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీరాములు, ఎడ్ల శివ, తదితరులు ఉన్నారు.