ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత అధ్యక్షతన, భాషోపాధ్యాయులు జాన్కాంతారావు,కె.బాలస్వామి, పుల్లయ్య ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతృభాషను మర్చిపోతే తల్లిని మర్చిపోయి నట్లేనని మాతృభాష పరిరక్షణ కోసమే యునెస్కో ప్రపంచవ్యాప్తంగా మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తుందని, ఏ భాష అయినా మనుగడలో లేకపోతే చివరకు భాషతో పాటు ఆ జాతే అంతమయిపోతుందని అన్నారు.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని భాషలు అంతరించిపోయాయని రాబోయే తరంలో మన తెలుగు భాషను పరిరక్షించే బాధ్యతను విద్యార్ధులు గా మీ పైననే ఉందని అన్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు మాట్లాడుతూ మాతృభాషపై పట్టు సాధిస్తే ఇతర భాషలతో పాటు విషయాంశాలపై కూడా పట్టు సాధించగలమని తెలుగు భాష గొప్పదనం గురించి ఇతర దేశాలలో సైతం చర్చలు జరుగుతున్నాయని విద్యార్ధి దశలోనే కవిత్వం, కథలు వ్రాయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. అలా వ్రాయగలిగితే భాషపై పట్టు సంపాదించవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన భాషా పాటవ పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు అందచేశారు. అనంతరం విద్యార్థినీ విద్యార్ధులు తెలుగు భాషాపరమైన అంశాలపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.  ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు,విద్యార్ధులు పాల్గొన్నారు.