ఉచిత కరెంట్‌ , రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ వారంలో అమలు

''ఢిల్లీలో మోడీ.. గల్లీలో కేడీ కేసీఆర్‌ తెలంగాణకు తీరని ద్రోహం చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా కల్పిస్తామని– త్వరలోనే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ
– బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్రలను తిప్పి కొట్టాలి
– మోడీ హామీ ఇచ్చిన పాలమూరు రంగారెడ్డికి జాతీయ హౌదా ఏమైంది..?
– 14 పార్లమెంట్‌ సీట్లను గెలిపించి తీరాలి : కోస్గి బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
– కొడంగల్‌లో రూ.4369 కోట్లతో 20 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
– మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి పేరు ప్రకటన
నవ తెలంగాణ -మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
”ఢిల్లీలో మోడీ.. గల్లీలో కేడీ కేసీఆర్‌ తెలంగాణకు తీరని ద్రోహం చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా కల్పిస్తామని కేంద్రం మాట తప్పింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ని పెండింగ్‌ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు. వచ్చే ఎన్నికల్లో బీజీపీ, బీఆర్‌ఎస్‌ను ఓడించి తీరాలి. తెలంగాణలో 14 పార్లమెంట్‌ స్థానాలు గెలిచి తీరాలి.. త్వరలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం.. వారం రోజుల్లో తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి పేదవారికీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తాం..” అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రేవంత్‌ తొలిసారి పర్యటించారు. రూ.4,369 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.వలసల జిల్లా పాలమూరుకు వలస వచ్చిన కేసీఅర్‌ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పదేండ్ల కాలంలో ఒక్క ఎకరాకైనా సాగు నీరు ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్‌ మొదలు పెట్టిన తెలంగాణ ఉద్యమంలో కేసీఅర్‌ దూరాడు తప్ప ఉద్యమాన్ని ఆయన మొదలు పెట్టలేదని చెప్పారు. సమైక్యాంధ్రలో జరిగిన దోపిడీ కంటే తెలంగాణ రాష్ట్రంలో అధికంగా జరిగిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌తో చేసుకున్న చీకటి ఒప్పందం వల్లే 203 జీవో ద్వారా అక్రమంగా 12 టీఎంసీల నీటిని తీసుకెళ్లారని వివరించారు. రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులతో కాంట్రాక్టర్లకు తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. మక్తల్‌, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధి నుంచి ఏటా లక్షలాది మంది వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు గడ్డ నన్ను ఆశీర్వదించి అక్కున చేర్చుకుందని, తాను ముఖ్యమంత్రి కావడానికి కారణమైన కొడంగల్‌ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తనదని స్పష్టం చేశారు. మార్చి 15న రైతుబంధు, రైతు భరోసా అమలు చేస్తామన్నారు.
బీజేపీకి, బీఆర్‌ఎస్‌కు చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. ప్రధాని మోడీ జిల్లాకు వచ్చినప్పుడు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చి పదేండ్లయినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. జాతీయ రహదారులు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో నలుగురు ఎంపీలు బీజేపీ వాళ్లు గెలిచినా తెలంగాణకు నాలుగు రూపాయలు అయినా తేలేదని విమర్శించారు. అందువల్ల ఉద్యోగాలు రావాలన్నా, ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా, దేశంలో తెలంగాణ అగ్రభాగంలో నిలబడాలన్నా కాంగ్రెస్‌ను ఆదరించి అత్యధిక మెజార్టీతో ఎంపీ సీట్లు గెలిపించాలని కోరారు. కొడంగల్‌, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలో రూ.4369.143 కోట్లతో అభివృద్ధి పనుల కోసం భూమి పూజ చేసినట్టు చెప్పారు. గత పాలకుల చేత వివక్షకు గురికాబడిన ఈ ప్రాంత సాగు భూములకు నీరందించే కొడంగల్‌, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. ప్రాజెక్టు కోసం రూ.2945 కోట్లకు టెండర్లను సైతం పిలుస్తున్నామని తెలిపారు. రూ.300 కోట్లతో వెటర్నరీ కళాశాల, రూ.344.5 కోట్లతో రెండు లైన్ల రోడ్డు, రూ.224.50 కోట్లతో మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌, ఫిజియోథెరఫి కళాశాలలకు శంకుస్థాపన చేశామన్నారు. కొడంగల్‌ పట్టణంలో 220 బెడ్స్‌ ఆస్పత్రి, రూ.213.20 కోట్లతో టీచింగ్‌ కళాశాల, పంచాయత్‌ రాజ్‌ రోడ్లు, ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రోడ్లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. అలాగే, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వంశీచంద్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, కొడంగల్‌ నియోజకవర్గంలోనే 50వేల మెజార్టీ రావాలని అన్నారు.కార్య క్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ దామోదర రెడ్డి, సీడీడబ్ల్యూసీ నాయకులు వంశీచంద్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మల్లు రవి, యెన్నం శ్రీనివాసరెడ్డి, పర్నిక రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, వాకిట శ్రీహరి, వంశీకృష్ణ, మేఘా రెడ్డి, నరేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.