– బస్సుయాత్ర పేరుతో ఆదివాసీలపై బీజేపీ కపటప్రేమ : టీఏజీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిడియం బాబురావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన యువతకు ఉద్యోగాల్లో వందశాతం రిజర్వేషన్ కల్పించే జీవో నెంబర్ మూడును పునరుద్ధరించేందుకు రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్‌ను జారీ చేయించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు దేశంలోని అడవిని పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్న బీజేపీ మరోవైపు ఆదివాసీలపై ప్రేమ ఉన్నట్టు కొమురం భీం పేరుతో ఎన్నికల యాత్ర చేస్తే తాము నమ్మాలా?అని ప్రశ్నించారు. సహజ వనరులను దోపిడీ చేస్తూ కొన్ని వందల ఏండ్ల నుంచి బ్రిటీష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న చట్టాలను మోడీ ప్రభుత్వం ఈ పదేళ్ల పాలనలో కాలరాసిందని విమర్శించారు. ఎన్నికల బస్సుయాత్రకు కొమురం భీం పేరు పెట్టే అర్హత బీజేపీకి లేదన్నారు. నూతన అటవీ సంరక్షణ పేరుతో ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించడన్ని ఆపాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఆదివాసీలకు వేసవిలో పని కల్పించే ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని కల్పించి కూలి రూ.600 ఇవ్వాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న తునికాకు బోనస్ విడుదల చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో స్పెషల్ డీఎస్సీ వేయాలని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, ఉపాధ్యక్షులు తొడసం భీంరావ్, బండారు రవి కుమార్, సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య, పొలం రాజేందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కోరేంగా మాలశ్రీ, ఉయిక విష్ణు, ఆత్రం తనుష్, మడవి నాగోరావ్, లంక రాఘవులు, కోట శ్రీనివాస్, గొంది రాజేష్, సూడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.