– చెలరేగిన మంటలు
– భారీ ప్రమాదమే తప్పింది : ఎమ్మెల్యే హరీశ్ రావు
నవతెలంగాణ-సిద్దిపేట
సిద్దిపేట సబ్‌స్టేషన్‌లో ఒక్కసారిగా భారీగా పేలుడు, మంటలు చెలరేగాయి. దాంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనల కు గురయ్యారు. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద నున్న 220 కేవీ సబ్ స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా పీటీఆర్ పేలి మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న స్థానికులు పేలుడు దాటికి బయటకు వచ్చారు. వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించడం తో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నా రు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఘటనాస్థలానికి బయలు దేరారు. దారిలోనే..ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ఫోన్‌లో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. గజ్వేల్, దుబ్బాక, హుస్నాబా ద్ ఫైర్ స్టేషన్ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే హరీశ్‌రావు.. మూడు ఫైర్ ఇంజన్లు ఏర్పాటుచేసి మంటను ఆర్పాలని కోరారు. మంటలు ఆపే వరకు విద్యుత్ అధికారులను, ఫైర్ సిబ్బందిని కి సూచనలు ఇస్తూ, పర్యవేక్షించారు. సుమారు మూడు గంటలు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రాత్రి 7.30 గంటల సమయంలో విషయం తెలవగానే ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలిపారు. 220 కేవీ సబ్ స్టేషన్ పరిసరాల్లోనే 132 కేవీ సబ్ స్టేషన్, ఇతర సబ్ స్టేషన్లు ఉన్నాయని, కానీ భారీ ప్రమాదం తప్పిందని అన్నారు. సంఘటనను చూసి ఆందోళనకు గురయ్యానని, ఫైర్ సిబ్బంది, విద్యుత్ అధికారుల సమిష్టి కృషి ఫలితంగా మంటలు అదుపులోకి వచ్చినట్టు చెప్పారు. ఘటనపై విచారణ జరిపించాలని అధికారులను కోరారు. విద్యుత్ సరఫరా లేని ప్రాంతాలకు .. దుద్దెడ, జక్కాపూర్, హబ్సిపూర్, పాలమకుల 132 కేవీ సబ్ స్టేషన్ల నుంచి విద్యుత్ పునరుద్ధరించనున్నట్టు తెలిపారు. కాగా, ఘటనాస్థలంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి, సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.