పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు నిషేధం

Cell phones are not allowed in the exam centers– ఇంటర్‌, టెన్త్‌ పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలి : కలెక్టర్లు, పోలీసు అధికారులకు సీఎస్‌ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఈనెల 28 నుంచి వచ్చేనెల 19 వరకు జరిగే ఇంటర్మీడియట్‌ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతి కుమారి ఆదేశించారు. ఇంటర్‌, పదో తరగతి పరీక్షల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్‌ అధికారులు, విద్యా శాఖాధికారులు, సంబంధిత అధికారులతో బుధవారం ఆమె టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి కుమారి మాట్లాడుతూ ఇంటర్‌ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి సుమారు 9,80,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. మొత్తం 1,521 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని అన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఉన్నతాధికారులతో సహా ఏ ఉద్యోగి కూడా సెల్‌ఫోన్‌లను తీసుకెళ్లొద్దనీ, ఆ విధంగా తీసుకెళ్లడాన్ని నిషేధించామని స్పష్టం చేశారు. పరీక్షా ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు లేదా మూల్యాంకన కేంద్రాలకు తీసుకెళ్లేటప్పుడు పటిష్టమైన బందోబస్తు ఉండాలని కోరారు. ఏ విధమైన పరీక్షా పత్రాలు కూడా లీక్‌ అవ్వకూడదని ముఖ్యమంత్రి పలు మార్లు హెచ్చరించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. పరీక్షా పేపర్ల తరలింపుపై జిల్లా స్థాయిలో సంబంధిత పోలీస్‌ సూపరింటెండెంట్‌లు, తపాలా శాఖ అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వచ్చేనెల 18 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ రెండో తేదీ వరకు జరుగుతాయని వివరించారు. 5.8 లక్షల మంది విద్యార్థినీ, విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారనీ, 2,676 కేంద్రాలలో జరుగుతాయని చెప్పారు. ఈ పరీక్షలను కూడా పటిష్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పటిష్టమైన ఏర్పాట్లతో ఇంటర్‌, పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలని అధికారులను కోరారు. పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు తగు విధంగా అందుబాటులో ఉంచాలని సూచించారు. వైద్యారోగ్య శాఖ అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద తగు ప్రాథమిక చికిత్స ఏర్పాట్లు చేసి ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అన్నారు. ఎలాంటి చిన్న పొరపాట్లకు తావు లేకుండా పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీజీపీ రవి గుప్తా మాట్లాడుతూ ఇంటర్‌, పదో తరగతి పరీక్షలను ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, అడిషనల్‌ డీజీ సంజరు జైన్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మొహంతి, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాకులు ఎ కృష్ణారావు, అన్ని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, జిల్లా ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.