– మెరుగ్గా వైద్య సేవలందించేందుకు టెక్నికల్ కమిటీ :మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కొత్త ఆస్పత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లో డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ పనుల పురోగతిపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వాటి నిర్మాణం తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబా టులోకి తేవాలని సూచించారు. వివిధ జిల్లాల నుంచి వైద్యం కోసం హైదరాబా ద్‌కు వచ్చే రోగులకు మెరుగ్గా సేవలందించేందుకు వీలుగా టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆ కమిటీ సూచనల మేరకు ఆస్పత్రుల్లో స్పెషాలిటీ సేవలు, వివిధ రకాల చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరంగల్‌లో 2,100 బెడ్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు హైదరాబాద్‌లోని అల్వాల్ నిర్మిస్తున్న 1,200 పడకల టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎల్బీనగర్, సనత్‌నగర్‌లలో వెయ్యి పడకల చొప్పున నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రులు, ఎర్రమంజి ల్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో 2 వేల పడకల సామర్థ్యంతో విస్తరణ పనులను ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ, రాష్ట్ర వైద్యవిద్య సంచాలకురాలు డాక్టర్ వాణి, రోడ్లు, భవనాలశాఖ ఈఎన్సీ గణపతి రెడ్డి, కన్సల్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.