చిలీ నోబెల్‌ గ్రహీత పాబ్లో నెరుడా మృతిపై మళ్లీ దర్యాప్తు

– అప్పీల్స్‌ కోర్టు రూలింగ్‌
శాంటియాగో : చిలీలో 1973లో సైనిక కుట్ర చోటు చేసుకున్న కొద్ది రోజుల తర్వాత సంభవించిన నోబెల్‌ బహుమతి గ్రహీత పాబ్లో నెరుడా మృతిపై మళ్లీ దర్యాప్తు జరపాలని అప్పీల్స్‌ కోర్టు రూలింగ్‌ ఇచ్చింది. ఈ తాజా ఆదేశాలతో కమ్యూనిస్టు కవి మృతికి దారి తీసిన పరిస్థితులు స్పష్టం కావడానికి సాయపడుతుందని న్యాయస్థానం పేర్కొంది. నెరుడా మరణ ధృవీకరణ పత్రంలో నమోదు చేసిన కేన్సర్‌ కాకుండా ఇతర కారణాలను కూడా పరిశీలించేందుకు కేసును తిరిగి తెరవాల్సిందిగా నెరుడా మేనల్లుడు రొడాల్ఫ్‌ రీయాస్‌ గత డిసెంబరులో విజ్ఞప్తి చేశారు. అయితే న్యాయమూర్తి దాన్ని తిరస్కరించారు. ఆయనపై విష ప్రయోగం జరిగిందనడానికి సాక్ష్యాధారాలున్నాయని కెనడా, డెన్మార్క్‌, చిలీలకు చెందిన నిపుణులు కనుగొన్నారని రీయాస్‌ తెలిపారు. నెరుడా శరీరంలో పెద్ద మొత్తంలో విష పదార్దం వుందని డానిష్‌, కెనడా ప్రయోగశాలల్లో జరిగిన పరీక్షల్లో తెలిసింది. ఈ విషం వల్ల ఆయన నాడీ వ్యవస్థ మొత్తం కుప్పకూలిందని రీయాస్‌ పేర్కొన్నారు. ఆయనపై విష ప్రయోగం జరిగిందంటూ ఆయన డ్రైవర్‌ దశాబ్దాల తరబడి ఘోషిస్తూనే వున్నారు. గత డిసెంబరులో దీనిపై జడ్జి రూలింగ్‌ ఇస్తూ, ఫోరెన్సిక్‌ పరీక్షలు ఇప్పటికే నిర్వహించారని, లేదా ఫలితాలు ఆలస్యంగా వచ్చాయని, పైగా ఇవి వేటికీ దారి తీయలేదన్నారు. కానీ మంగళవారం అప్పీల్స్‌ కోర్టు ఏకగ్రీవగా ఆ న్యాయమూర్తి రూలింగ్‌ను కొట్టివేసి, తిరిగి దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించింది.