పోరాటాలకు పునరంకితమవుదాం

Let's get back to fighting– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య
– రాజకీయ తీర్మానానికి సమావేశం ఏకగ్రీవ ఆమోదం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర, దేశ ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తక్షణ కర్తవ్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీని, ఆ పార్టీకి సహకరించే పార్టీలను గెలవకుండా చూడాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. రెండురోజులపాటు జరగనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర విస్తృత సమావేశం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్పారు. ఆరు గ్యారంటీలను వందరోజుల్లో అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారని అన్నారు. బీఆర్‌ఎస్‌ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నదనీ, ప్రభుత్వంపై దాడి చేస్తున్నదని చెప్పారు. బీజేపీ ప్రజాసమస్యలను విస్మరించిందని విమర్శించారు. రామాలయం పేరుతో రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నదని అన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్న పేదలపై పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలనీ, గుడిసెలు వేసుకున్న అర్హులైన వారికి పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్మికుల కనీస వేతనాలను సవరించాలని కోరారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల మీద ప్రభుత్వం దృష్టిసారించాలనీ, సత్వరమే వాటిని పరిష్కరించాలని కోరారు. వీరయ్య ప్రవేశ పెట్టిన రాజకీయ తీర్మానాన్ని ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు.