– ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొీట్టిన కారు
– ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి
– డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
– ఘటనపై ఎమ్మెల్యే సోదరి ఫిర్యాదు
– డ్రైవర్‌పై కేసు నమోదు
– పోరెన్సిక్, క్లూస్ టీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ
– అతివేగం, నిద్రమత్తే కారణమని అనుమానం
– శామీర్‌పేట్ ఓఆర్‌ఆర్ నుంచి పటాన్‌చెరు వైపు వస్తుండగా ఘటన
– సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల నివాళులు
– పాడె మోసిన మాజీ మంత్రి హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ-పటాన్‌చెరు/కంటోన్మెంట్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమె ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగ్ రోడ్డుపై పటాన్‌చెరు సమీపంలో అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొీట్టింది. ఈ ప్రమాదంలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. కారు డ్రైవర్ ఆకాశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సీటు బెల్ట్‌ను సరిగ్గా పెట్టుకోకపోవడంతోనే ఆమె ప్రాణం కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం, అతి వేగమే ప్రమాదానికి కారణంగా అనుమానం వ్యక్తమవుతున్నాయి. కాగా, ఎమ్మెల్యే భౌతికకాయానికి సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యే లు, నేతలు నివాళులర్పించారు. అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో మారేడ్‌పల్లిలో పూర్తయ్యాయి. ప్రమాదానికి సంబంధించి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్, ఏఎస్పీ సంజీవరావు వివరాలు వెల్లడించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(37) గురువారం రాత్రి 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి రెండు కార్లలో బయలుదేరారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం, ఆరూర్ గ్రామంలో మిస్కిన్‌షా బాబా దర్గాను సందర్శించారు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. ఆ తర్వాత అల్పాహారం కోసమంటూ శుక్రవారం ఉదయం 5.10 గంటల సమయంలో ఆమె డ్రైవర్‌తో కలిసి బయటకు వచ్చారు. శామీర్‌పేట వద్ద ఓఆర్‌ఆర్‌పైకి వచ్చి సుల్తాన్‌పూర్ టోల్‌ప్లాజా దాటిన తర్వాత డ్రైవర్ ఆకాశ్ నిద్రమత్తు వల్ల స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయాడు. కారు అదుపు తప్పడంతో ముందు ఓ గుర్తు తెలియని వాహనాన్ని గుద్దుకుని.. ఎడమ వైపు ఉన్న ఓఆర్‌ఆర్ మెటల్ బీమ్‌కు బలంగా ఢీకొీట్టారు. కారు ముందు భాగం నుజ్జు నుజ్జైంది.. దాంతో కారులో ముందు సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే లాస్య నందిత తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వెంటనే ఆమెను, డ్రైవర్‌ను పటాన్‌చెరులోని అమేధ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో లాస్య మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోరెన్సిక్ వైద్యుల పర్యవేక్షణలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఆకాష్‌ను మియాపూర్‌లోని శ్రీకర ఆస్పత్రికి తరలించారు. పోరెన్సిక్, క్లూస్ టీంతో పాటు రవాణా శాఖ అధికారులతో ఏఎస్పీ సంజీవరావు, డీఎస్పీ రవిందర్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే లాస్య నందిత మరణ వార్త తెలిసిన వెంటనే మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ నేతలు వెంటనే అమేధ లాస్య మృతదేహాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు శుక్రవారం రాత్రి హైదరాబాద్ మారేడ్‌పల్లి శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ముందుగా గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కార్ఖానా గృహలక్ష్మి కాలనీలోని ఆమె ఇంటికి తరలించారు. అక్కడ వివిధ పార్టీల నేతలు, అధికారులు, పలువురు ప్రముఖులు ఆమె భౌతికకాయానికి నివాళ్లర్పించారు. తర్వాత అంతిమయాత్ర సాగింది. మారేడ్‌పల్లి హిందూ హ్మశాన వాటికకు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు చేరుకుంది. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి తదితరులు పాడె మోశారు. అనంతరం పోలీసులు గాలిలో మూడుసార్లు కాల్పులు జరిపి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వేలాదిమంది అభిమానులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు అక్కడకు వచ్చారు. హరీశ్‌రావు కార్యక్రమం పూర్తయ్యే వరకు కుటుంబ సభ్యుల వెన్నంటే ఉన్నారు.
సీఎం రేవంత్ నివాళ్లు
ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి ఆమె ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, పలువురు నేతలు నివాళులర్పించారు.
బీఆర్‌ఎస్ అధినేత నివాళి
లాస్య నందిత భౌతికకాయానికి బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ భౌతికకాయానికి నివాళ్లర్పించారు. లాస్య తల్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ కేశవరావు, ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కేఏ పాల్ తదితరులు లాస్య భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
పోస్టుమార్టం రిపోర్టులో కీలక అంశాలు
ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు రిపోర్టు ప్రాథమిక నివేదిక ప్రకారం.. లాస్య తలకు బలమైన గాయాలయ్యాయి. తై బోన్, రిబ్స్ విరిగిపోయాయి. ఒక కాలు పూర్తిగా విరిగిపోయిందని, దవడ ఎముకలు విరగడంతోపాటు దంతాలు ఊడిపోయాయని తెలుస్తోంది. పక్కటెముకలు చాలా వరకు దెబ్బతిన్నాయి. తలకు బలమైన గాయాలు కావడం వల్లే స్పాట్‌లోనే చనిపోయిందని వైద్యులు వెల్లడించారు.
డ్రైవర్‌పై ఫిర్యాదు
తన సోదరి లాస్య నందిత మరణంపై అనుమానాలు ఉన్నాయని, డ్రైవర్ కం పీఏపై ఎమ్మెల్యే సోదరి నివేదిత పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే చేసినట్టుగా అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. నల్లగొండలో జరిగిన సంఘటనపై డ్రైవర్‌ను మందలించడంతో.. కోపంతో ఏమైనా చేసి ఉంటారన్న కోణంలో డ్రైవర్‌పై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. నివేదిత ఫిర్యాదు మేరకు ఆకాశ్‌పై కేసు నమోదు చేసి ప్రమాదంపై నిపుణుల సమక్షంలో దర్యాప్తు చేపట్టినట్టు ఏఎస్పీ సంజీవరావు తెలిపారు. పది రోజుల వ్యవధిలోనే ఆమె రెండోసారి రోడ్డు ప్రమాదానికి గురికావడం గమనార్హం.