మొదటి నెల జీతం పెన్షనర్స్‌ సంఘానికి..

– రూ.1.5లక్షలు అందజేసిన షాద్‌నగర్‌ ఎమ్మెల్యే శంకర్‌
నవతెలంగాణ-షాద్‌నగర్‌
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ తన మొదటి నెల వేతనాన్ని షాద్‌నగర్‌ తాలూకా రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షనర్స్‌ సంఘానికి విరాళంగా అందజేశారు. ఇటీవల రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. అయితే, ఎమ్మెల్యే శంకర్‌ తన మొదటి నెల వేతనాన్ని సంఘానికి ఇస్తానని హామీ ఇచ్చారు. శనివారం ఉదయం సంఘం నాయకులు సరాపు జగదీశ్వర్‌, రామారావు, జనార్ధన్‌కు రూ.1.5లక్షల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ సంఘానికి తన వంతుగా ఆర్థిక సహాయం అందజేసినట్టు తెలిపారు. ఎమ్మెల్యే శంకర్‌ను ఉద్యోగులు అభినందించి సన్మానించారు.