– 28 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఈనెల 28 నుంచి వచ్చేనెల 19 వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహిస్తామని తెలిపారు. హాల్‌టికెట్లు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లో పొందుపరిచామనీ, విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు కూడా వారి లాగిన్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్థులకు ఇవ్వాలని సూచించారు. వాటిలో ఫొటో, సంతకం, పేరు, మాధ్యమం, సబ్జెక్టులు వంటి వివరాలను పరిశీలించాలని కోరారు. ఏమైనా అభ్యంతరాలుంటే కాలేజీల ప్రిన్సిపాళ్ల ద్వారా డీఐఈవోలకు పంపించాలనీ, వెంటనే సరిదిద్దుకోవాలని తెలిపారు. వెబ్‌సైట్ ద్వారా తీసుకున్న హాల్‌టికెట్లలో ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా ఇంటర్ వార్షిక పరీక్షలకు అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి సుమారు 9,80,000 మంది విద్యార్థులు హాజరవుతున్న విషయం తెలిసిందే. వారి కోసం 1,521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.