– ఒకరిని కాపాడబోయి మరొకరు..
– కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదెల్లిలో ఘటన
నవతెలంగాణ-గాంధారి
ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరు వు నీటిలో మునిగిపోయి మృతి చెందారు. ఒకరిని కాపాడబోయి మరొకరు.. ఇలా ఇద్దరూ చనిపో యారు. ఈ విషాధ ఘటన కామా రెడ్డి జిల్లా గాంధారి మండలంలో ని ముదెల్లి గ్రామంలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మిద్దెల రవీందర్(9), చెల్లి మనీషాతో పాటు సుతారి శశాంక్ (9) శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో టైరు ఆట ఆడారు. ఆడుకుంటూ గ్రామ సమీపంలోని పెద్దచెరువు వైపు వెళ్లారు. అక్కడ రవీందర్ కాలకృత్యాలకు వెళ్లాడు. ఈ క్రమంలో రవీందర్ ప్రమాదవశాత్తు చెరువులో పడి నీటిలో మునిగి పోవడంతో అతన్ని కాపాడబోయి శశాంక్ మునిగాడు. ఇది గమనించిన మనీషా వెళ్లి తల్లిదండ్రులకు, గ్రామస్తులకు తెలిపింది. వారు ఘటనా స్థలానికి వచ్చేసరికే ఇద్దరూ మృతి చెందారు. మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీశారు. మిద్దెల రవీందర్ తండ్రి రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఆ రెండు కుటుంబాల వారు బాన్సువాడకు వెళ్లి శనివారం ఆలస్యంగా ఇంటికి రావడంతో పిల్లలు పాఠశాలకు వెళ్లలేకపోయారు. దీంతో ఆడుకునేందుకు వెళ్లిన పిల్లలు ప్రాణం కోల్పోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.