ప్రజాస్వామ్య రక్షణలో మీడియా వైఫల్యం

ప్రజాస్వామ్య రక్షణలో మీడియా వైఫల్యం– రాజ్యాంగ పరిరక్షణ, వాస్తవాల వెలికితీతలో కూడా…
– సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్‌ జోసఫ్‌
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్‌ జోసఫ్‌ మీడియాపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో, రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో మీడియా దారుణంగా విఫలమైందని ఆయన విమర్శించారు. వాస్తవాల వెలికితీతలో కూడా వైఫల్యాన్ని మూటకట్టుకున్నదని చెప్పారు. నిర్భీతితో కూడిన వాస్తవాలు బయటికి రావడం లేదని, నాలుగో స్తంభమైన మీడియా విఫలం కావడమే ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని అన్నారు. క్యాంపెయిన్‌ ఫర్‌ జ్యుడీషియల్‌ అకౌంటబులిటీ అండ్‌ రిఫామ్స్‌ (సీజేఏఆర్‌) సంస్థ ఏర్పాటు చేసిన సెమినార్‌ను ఉద్దేశించి కురియన్‌ ప్రసంగించారు.
‘ఈ సమావేశానికి ముందు మనం కొన్ని విషయాలను చర్చించాం. వాటన్నింటినీ మనం ఏ మీడియాలో అయినా చదవగలమా? ఎలక్ట్రానిక్‌ మీడియాలో చూడగలమా? ఏవో కొన్ని డిజిటల్‌ ప్రైవేటు మీడియా సంస్థల ప్రసారాలలోనే వాటిని మనం చూడగలం’ అని కురియన్‌ వ్యాఖ్యానించారు. చట్టవిరుద్ధమైన, అనైతిక పనులకు పాల్పడే వారి గుట్టు రట్టు చేసే వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఇప్పుడు వారి పైనే ఆశలు మిగిలాయని ఆయన చెప్పారు. వారు ప్రజాస్వామ్యానికి ఐదో స్తంభం వంటి వారని అన్నారు. ‘మొదటి మూడు స్తంభాలను గురించి మరచిపొండి. నాలుగో స్తంభమే మీడియా. అయితే అది ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో విఫలమైంది. నిజాన్ని వెలికితీయడంలో కూడా విఫలమైంది’ అని తెలిపారు.
‘అవినీతిపరులను గురించి మనల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే వ్యక్తులు కూడా ఇప్పుడు క్రియాశీలకంగా ఉండడం లేదు. వారిలో కొందరు మాత్రమే ఇప్పటికీ చైతన్యం ప్రదర్శిస్తున్నారు. కాబట్టి మనం వారికి మద్దతు ఇవ్వాలి. వారికి బాసటగా నిలవాలి. అప్రమత్తంగా ఉండాలి’ అని జస్టిస్‌ కురియన్‌ సూచించారు.