– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్
– నేటి ఆందోళనలను జయప్రదం చేయాలని పిలుపు
నవతెలంగాణ-కంఠేశ్వర్
రైతాంగ ఉద్యమంపై నిర్బంధాన్ని ఆపాలని, కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ఎస్కేఎం రాష్ట్ర నాయకులు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. కేంద్ర హౌం మంత్రి, హర్యానా ముఖ్యమంత్రిపై హత్యానేరం మోపాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో మృతిచెందిన యువ రైతు శుభకరన్ సింగ్ స్ఫూర్తితో రైతు పోరాటాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. రైతుల నిరసన స్థలంలో రైతుల ట్రాక్టర్లను పోలీసులు ధ్వంసం చేశారన్నారు. టియర్‌గ్యాస్ ప్రయోగించడం, రైతులపై దాడి చేయడం లాంటి చర్యలకు పాల్పడుతున్న కేంద్ర హౌంమంత్రి అమిత్ షా, హర్యానా ముఖ్యమంత్రి, రాష్ట్ర హౌంమంత్రి, మనోహర్ లాల్ ఖట్టర్, అనిల్ విజ్ రాజీనామా చేయాలని, వారిపై సెక్షన్ 302 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. కాల్పులు, ట్రాక్టర్లకు జరిగిన నష్టంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని, పాడైన 100 ట్రాక్టర్ల మరమ్మతు ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఫిబ్రవరి 26న జాతీయ రహదారులపై ట్రాక్టర్లు, వాహనాల ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో జరిగే ఆందోళనలో పార్టీలకతీతంగా రైతులు, ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. నిజామాబాద్ పట్టణంలో గాంధీ చౌక్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ ఉంటుందని తెలిపారు. సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గంగాధరప్ప, పల్లపు వెంకటేశ్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమన్న, నాయకులు డి.కృష్ణ గౌడ్, శ్రీనివాసరెడ్డి, బన్సీ తదితరులు పాల్గొన్నారు.