నన్ను అవమానించారు

నన్ను అవమానించారు– ఇక జీవితంలో ఆంధ్ర తరఫున ఆడను
– ఆంధ్ర క్రికెట్‌ సంఘంపై విహారి ఆరోపణ
హైదరాబాద్‌ : ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ)పై భారత క్రికెటర్‌ హనుమ విహారి తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ నాయకుడి ఒత్తిడికి తలొగ్గి అవమానకర రీతిలో కెప్టెన్సీ నుంచి తప్పించారని, ఇక జీవితంలో ఆంధ్ర తరఫున దేశవాళీ క్రికెట్‌ ఆడబోనని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘బెంగాల్‌తో రంజీ మ్యాచ్‌ సందర్భంగా జట్టులోని 17వ ఆటగాడిపై అరిచాను. ఆటలో ఇది అత్యంత సహజం. కానీ అతడు నా మాటలను వ్యక్తిగతంగా తీసుకున్నాడు. ఆ ఆటగాడి తండ్రి రాజకీయ నాయకుడు కావటంతో.. ఒత్తిడి తీసుకొచ్చి సారథ్య బాధ్యతల నుంచి నన్ను తప్పించారు. జట్టు కోసం, ఆట కోసం ఈ సీజన్‌లో ఆంధ్రతోనే కొనసాగాను. సీజన్లో ఆంధ్ర తరఫున ఆఖరు మ్యాచ్‌ వరకు మౌనంగా ఉన్నాను. భారత జట్టు తరఫున 16 టెస్టులు ఆడిన నన్ను అవమానకర రీతిలో కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఆటను అభివృద్ది చేయాలనే ఆలోచన ఆంధ్ర క్రికెట్‌ లేదు. జీవితంలో మళ్లీ ఆంధ్ర తరఫున ఆడబోను’ అని హనుమ విహారి రాసుకొచ్చాడు. విహారి వ్యాఖ్యలపై 17వ ఆటగాడు పృథ్వీరాజ్‌ కెఎన్‌, ఆంధ్ర క్రికెట్‌ సంఘం స్పందించాయి. ‘విహారి చెప్పిన ఆ 17వ ఆటగాడిని నేనే. ఆయన చెప్పిదంతా అబద్ధం. డ్రెస్సింగ్‌రూమ్‌లో అందరి ముందు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి దూషించారు. విహారికి మద్దతుగా లెటర్‌పై సంతకాలు చేసిన క్రికెటర్లు నాకు వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపించి నన్ను సమర్థిస్తున్నారు. ఇలా అబద్ధాలు చెప్పి సానుభూతి పొందటం తప్ప నువ్వు (విహారి) ఏం చేయలేవు’ అని పృథ్వీరాజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఇక విహారి ప్రవర్తనపై విజరు హజరే టోర్నీ సమయంలోనే ఫిర్యాదులు అందాయని, ఆటగాడు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఏసీఏ చర్యలు తీసుకుందని ఆంధ్ర క్రికెట్‌ సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక సోమవారం ముగిసిన రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో మధ్యప్రదేశ్‌ చేతిలో 4 పరుగులు తేడాతో ఆంధ్ర అనూహ్య పరాజయం చవిచూసింది.