– రవాణామంత్రికి టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికుల హయ్యర్ పెన్షన్ విషయంలోని సమస్యల్ని ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించినట్టు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావు తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం పీఎఫ్ ట్రస్ట్‌కు రూ.1,450 కోట్లు చెల్లించాల్సి ఉందనీ, అది ఇవ్వకపోవడంతో, కార్మికులకు హయ్యర్ పెన్షన్ డిమాండ్ నోటీసులు ఇవ్వట్లేదని వివరించారు. హయ్యర్ పెన్షన్ కోసం కార్మికులు చేసుకున్న దరఖాస్తులను టీఎస్‌ఆర్టీసీ పీఎఫ్ ట్రస్ట్ 2023 ఏప్రిల్‌లోనే రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్ కార్యాలయానికి పంపారని తెలిపారు. దాదాపు 10 నెలల సమయం గడిచినప్పటికీ కార్మికులకు డిమాండు నోటీసులు అందలేదనీ, ఆర్టీఐ ద్వారా సమాచారం తెలుసుకుంటే యాజమాన్యం పీఎఫ్ ట్రస్ట్‌కు డబ్బు చెల్లించలేదని వెల్లడైందనీ, కేవలం 125 మందికి మాత్రమే ్ల డిమాండ్ నోటీసులు వచ్చాయని పేర్కొన్నారు. అదే సమయంలో ఏపీఎస్‌ఆర్టీసీలో 11,608 మంది డిమాండ్ నోటీసులు అందుకున్నారని వివరించారు. సంస్థలో కార్మికులకు ఏటా మార్చి నెలలో ఇస్తున్న పీఎఫ్ స్లిప్పులన్నీ బుక్ అడ్జస్ట్‌మెంట్లుగా ఇచ్చినవే తప్ప, బోర్డుకు నగదు చెల్లించలేదని తెలిపారు. దీనివల్ల సంస్థలోని 42వేల మంది కార్మికులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. తక్షణం ఈ సమస్యల్ని పరిష్కరించి, కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.