సింగప్పగూడ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటా

– గ్రామాభివృద్ధికి గ్రామస్తుల సహకారం ఎంతో ఉంది
– సర్పంచ్‌ రహిమా బేగం
– సింగప్పగూడ గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని సన్మానించిన గ్రామస్తులు
నవతెలంగాణ-చేవెళ్ల
ఐదేళ్ల పదవికాలంలో గ్రామ ప్రజలు పంచాయతీ పాలకవర్గానికి ఎంతో సహకారం అందించారని సింగప్పగూడ గ్రామ సర్పంచ్‌ రహిమా బేగం అన్నారు. సోమవారం మండల పరిధిలోని సింగప్పగూడ గ్రామ పంచాయతీ పాలకవర్గంను సోమవారం చేవెళ్ల బీజేపీ సీనియర్‌ నాయకులు మల్గారి రమణారెడ్డి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు అలీ, గ్రామ పెద్దలు, గ్రామస్తులందరూ కలిసి సర్పంచ్‌ రహిమా బేగంని, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, వార్డు సభ్యులను ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించి విజయవంతంగా ఐదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ పాలకవర్గాన్ని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా రహిమబేగం మాట్లాడుతూ ఐదేండ్ల క్రితం సింగప్పగూడ సర్పంచ్‌గా గెలిపించిన గ్రామ ప్రజలకు, వార్డు సభ్యులకు, యువకులు, మహిళలకు, ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, ఏమిచ్చిన మీ రుణం తీర్చుకోలేనిదన్నారు. సింగప్పగూడ గ్రామ ప్రజలకు జీవితాంతం అండగా ఉంటానని. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో సర్పంచ్‌ పదవీకాలంలో గ్రామస్తులు, వార్డు సభ్యుల సహకారంతో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఐదేండ్ల పాటు గ్రామ సర్పంచ్‌గా నన్ను ఆదరించి గ్రామ అభివృద్ధికి సహకరించిన గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతునట్టు చెప్పారు. కార్యక్రమంలో గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.