– 13 రోజులు గడుస్తున్న బాధ్యతలు స్వీకరించని తహసీల్దార్, ఎంపీడీవో
– కీలక శాఖల అధికారులు లేకపోవడంతో ఇబ్బందుల్లో ప్రజలు
– ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న కార్యాలయాలు
– అధికారుల పనితీరుపై ఎంపీపీ, జడ్పీటీసీ పర్యవేక్షణ ఏది..?
నవతెలంగాణ-మాడ్గుల
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందా లంటే అధికారులదే కీలకపాత్ర. ఆయా శాఖలో అధికారులు సిబ్బంది ఉంటేనే ప్రజలకు పరిపాలన సక్రమంగా అందుతుంది. అయితే ఇటీవల ప్రభుత్వం వివిధ శాఖల్లో అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మాడుగుల మండల తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న నిరంజన్‌రావును బదిలీ చేసింది. ఆయన స్థానంలో మోతిలాల్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న రాఘవులును వికారాబాద్‌కు బదిలీ చేసి ఆయన స్థానంలో పద్మవతి మాడుగులకు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నెల 13న బదిలీలు జరగగా 14న పద్మవతి విధుల్లో చేరింది. కాగా వెంటనే ఈ నెల 24 శనివారం వరకు దాదాపు పది రోజులు సెలవు పెట్టింది. సోమవారం 26న విధుల్లో బాధ్యతలు చేపట్టవలసి ఉండగా ఆమె విధులకు హాజరు కాకపోవడంతో మాడుగులలో విధులు చేపట్టేందుకు అనాసక్తి చూపుతున్నట్టు మండలంలో చర్చ జరుగుతుంది. అదేవిధంగా తహసీల్దార్ మాత్రం ఇప్పటికీ 13 రోజులుగా విధుల్లో చేరకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం లో ఎక్కడిక్కడే సమస్యలు పేరుకుపోయాయి.
ప్రజా ప్రతినిధులపై విమర్శలు
మండలంలో 13 రోజులుగా కీలక శాఖలలో అధికారులు లేకపోవడంతో ప్రజాపాలనకు, వ్యవస్థకు నష్టం కలుగుతున్నప్పటికీ స్పందించవలసిన మండల ప్రజాప్రతినిధులు ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో మండలంలో వారిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు ఆరా తీయవలసిన ప్రజా ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వారిపై పలువురు మండల ప్రజలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మండల ప్రజా ప్రతినిధులు సక్రమంగా పట్టించుకుంటే అధికారులు ఈ పాటికి ఎప్పుడో వచ్చేవారని, వారు ఉన్న లేనట్టుగానే ఉందని వాపోతున్నారు.