షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

– రూ.4 లక్షల ఆస్తి నష్టం
నవతెలంగాణ-దుబ్బాక
కరెంట్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యి ఇల్లు దగ్ధమైన ఘటన దుబ్బాక పురపాలిక కేంద్రంలోని 15 వార్డులో సోమవారం జరిగింది. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ (ఆర్‌ఐ), ఫైర్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ కే.స్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 15వ వార్డుకు చెందిన గాజుల నరేష్‌ సిద్దిపేటలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం 11:43 గంటల సమయంలో నరేష్‌ దంపతులు పూజలు నిర్వహించేందుకు దగ్గరలోని దేవాలయానికి వెళ్లారు. ఇంట్లోంచి పొగలు వస్తుండడం గమనించిన స్థానికులు నరేష్‌కు ఫోన్‌ చేసి చెప్పారు. వెంటనే ఇంటికి చేరుకున్న నరేష్‌ దంపతులు అగ్ని ప్రమాదం పట్ల పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫైర్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ స్వామి నేతత్వంలోని లీడింగ్‌ ఫైర్‌మెన్‌ ఎస్‌.రాజేష్‌, ఫైర్‌మెన్‌లు , వినోద్‌, సీహెచ్‌ నవీన్‌లు గంటకు పైగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. ఘటనలో ఇంట్లోని రెండు గదులు, అందులోని విలువైన వస్తువులు, నగదు, బంగారం, ధ్రువపత్రాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. రూ.4 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు ఆర్‌ఐ నరసింహారెడ్డి,ఫైర్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ స్వామి వెల్లడించారు. కాగా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ తోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. ఘటన స్థలాన్ని వార్డు కౌన్సిలర్‌ పల్లి మీనా రామస్వామి గౌడ్‌, దుబ్బాక ఎస్‌ఐ వీ.గంగరాజు పరిశీలించారు.