ప్రకృతే శాశ్వతం..పచ్చదనంతోనే పరిపూర్ణ జీవితం

– అడవుల రక్షణ కోసం అంకితభావంతో పనిచేయాలి : మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రకృతే శాశ్వతమనీ, పచ్చదనంతోనే పరిపూర్ణ జీవితం సాధ్యమవుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. అడవుల సంరక్షణ కోసం అటవీ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో అటవీ శాఖ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి అరణ్యభవన్‌కు వచ్చిన మంత్రికి అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి వాణీ ప్రసాద్‌, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) ఆర్‌ఎం. డోబ్రియాల్‌, పీసీసీఎఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఎంసీ. పర్గెయిన్‌, విజిలెన్స్‌ పీసీసీఎఫ్‌ ఏలూసింగ్‌ మేరు, అన్ని జిల్లాల కన్జర్వేటర్లు, అధికారులు ఘనస్వాగతం పలికారు. సమావేశంలో క్షేత్ర స్థాయి అధికారులు చెప్పిన విష యాలను మంత్రి ఈ సందర్భంగా ఓపిగ్గా విన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారనీ, అందువల్ల ఉద్యోగుల కష్ట సుఖాలు తనకు తెలుసునని అన్నారు.
తమది స్నేహపూర్వక ప్రభుత్వమనీ, ఏ సమస్య ఉన్నా ఉద్యోగులు వచ్చి తనతో చెప్పుకోవచ్చునని భరోసానిచ్చారు. ప్రతి అటవీ అధికారి కూడా కుటుంబంతో సహా పనిచేసే ప్రదేశంలో ఉండాలని సూచించారు. ఇటీవల కాగజ్‌నగర్‌లో పులుల మరణం తనను కలిచివేసిందనీ, రానున్న రోజుల్లో అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అటవీ రక్షణ కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని ఆదేశించారు. చింత, జామ, నేరేడు, రేగు, సీతాఫలం, మునగ లాంటి స్థానిక జాతి మొక్కలను నర్సరీల్లో పెంచాలన్నారు. మిగతా పట్టణ ప్రాంతాలతో పాటు ట్రై సిటీస్‌గా ఖ్యాతిగాంచిన వరంగల్‌, హన్మకొండ, ఖాజీపేట నగరాల్లో పచ్చదనం పెంపు, పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. గిరిజనుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్య తనిస్తుందని నొక్కి చెప్పారు.
గుత్తికోయ ప్రభావిత ప్రాంతాల్లో తదుపరి ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా అటవీ స్టేషన్ల ఏర్పాటు, సిబ్బందికి ఆయుధాల అందజేత విషయంపై తమ ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని హామీనిచ్చారు. కోర్టు వివాదాలు త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటవీశాఖలోని ఖాళీల భర్తీకి సత్వర చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌ పెట్టేందుకు పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు.
వేసవిలో అటవీ అగ్ని ప్రమాదాల నివారణ, జంతువులకు నీటి వసతిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పెంపుడు పశువులు అడవుల్లోకి పోకుండా అటవీ శివారుల్లో ”పల్లె పశువుల వనాల” ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సూచించారు. ఎకోటూరిజంలో స్థానిక గిరిజనులకు, చెంచులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని ఆదేశించారు.