– దాని ఒత్తిడితోనే పంటలకు మద్దతు ధరల చట్టం ఇవ్వట్లేదు
– దేశంలో ఆహార భద్రతతో పాటు దేశ సార్వభౌమత్వానికి ప్రమాదం
– ఢిల్లీ నిరసనలో రైతుల డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలి
– సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు
నవతెలంగాణ-విలేకరులు
డబ్ల్యూటీవో (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) నుంచి భారత్ బయటకి రావాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నాయకులు డిమాండ్ చేశారు. డబ్ల్యూటీవో సూచనలతోనే కేంద్రంలోని మోడీ సర్కార్ పంటలకు మద్దతు ధరల చట్టం తీసుకురావడం లేదని విమర్శించారు. ఈ ప్రతిపాదనలు దేశంలో ఆహార భ్రదతకు, దేశ సార్వభౌమత్వానికి ప్రమాదకరమని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సోమవారం అబుదాబీలో ప్రారంభం కానున్న డబ్య్లూటీవో కాన్ఫరెన్స్‌ను నిరనిస్తూ.. ‘క్విట్ డబ్ల్యూటీవో డే’గా పాటించాలని ఎస్‌కేఎం కేంద్ర కమిటీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో బైక్ ర్యాలీలు, నిరసనలు చేపట్టారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం, అఖిల భారత రైతుకూలీ సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెవిలియన్ గ్రౌండ్ నుంచి ఇందిరా నగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి వై ప్రకాష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని విదేశీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు తహతహలాడుతోందన్నారు. రైతులకు ఎంఎస్‌పీని మంజూరు చేయకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను ఉపసంహరించుకోవడంతో పాటు ఆ ప్రయోజనం నేరుగా ప్రజలకు నగదు బదిలీ చేయాలని భారత దేశంపై డబ్ల్యూటీవో ఒత్తిడి చేస్తున్నదని ఆరోపించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన స్థలంలో రైతుల ట్రాక్టర్లను పోలీసులు ధ్వంసం చేయడంతో పాటు అణచివేత ప్రయోగించడం, రైతు ఉద్యమాన్ని ఏకాకిని చేసి విభజించేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. ఈ విభజనతో ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే మార్చి 14న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ సి. నారాయణ రెడ్డికి మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా సీపీఐ వికారాబాద్ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ మాట్లాడుతూ.. ఢిల్లీలో రైతులు న్యాయబద్ధంగా ఉద్యమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం రైతులను అణచివేసేందుకు రబ్బర్ బులెట్‌తో టియర్ గ్యాస్ వదు లుతూ బాష్పవాయువు గోళాలు వదిలి రైతు శుభకరన్ సింగ్ హత్య చేసిందన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. కామారెడ్డి పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణకేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో రైతు సంఘం, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆలేరులో రైతుకూలీ సంఘం, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.