విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి: ప్రొఫెసర్ దేవరాజుశ్రీనివాస్

నవతెలంగాణ – ఆర్మూర్ 
విద్యార్థులు భావిశాస్త్రవేత్తలుగా ఎదగాలి అని డాక్టర్ దేవరాజు శ్రీనివాస్ అన్నారు. పట్టణ శివారులోని గాంధీ నగర్ లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో మంగళవారం ఘనంగా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ యూనివర్సిటీ జీవశాస్త్ర ప్రొఫెసర్  డాక్టర్ దేవరాజు శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి సైన్స్ పై ఆసక్తిని పెంచుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఇటీవల మన దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒకే రాకెట్ తో 104 ఉపగ్రహాలను విజయవంతంగా పంపి, 104 ఉపగ్రహాలను ఒకే రాకెట్ తో పంపిన తొలి దేశంగా రికార్డు సృష్టించి ప్రపంచ దేశాలన్నింటి దృష్టి మన దేశంపై పడేలా చేసిందన్నారు. అలాగే మన దేశం ఇంకా శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే విధంగా విద్యార్థులకు బోధన  చేయాలని అన్నారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చి గొప్ప సృజనాత్మకత గల వైజ్ఞానిక  ప్రదర్శనలను తయారు చేయగలిగే స్థాయికి చేర్చిన ఉపాధ్యాయులను వారు అభినందించారు. పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ జిజ్ఞాసను పెంచడానికి ప్రతి సంవత్సరము ఇలాంటి సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెంపొందుతాయని ఆయన అన్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో సైన్స్ పట్ల మక్కువ పెంచడం వల్ల భవిష్యత్తులో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో తమ కెరీర్ ను ఎంచుకొని ఉన్నత స్థానంలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు అంశాల్లో ప్రదర్శించిన ప్రదర్శనలను వారు తిలకించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు గ్రూపుల వారీగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పాలనాధికారిని పద్మ వైస్ ప్రిన్సిపాల్ రమేష్ ఇన్చార్జ్ సృపన్ ప్రాజెక్ట్ గైడ్ లు ప్రసాద్  సుమతి నిఖిల విజయలక్ష్మి ఉపాధ్యాయని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.