అబుదాబీలో ఏం జరుగుతోందంటే…!

అబుదాబీలో ఏం జరుగుతోందంటే...!అబూదాబీలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) సభ్య దేశాల మంత్రుల పదమూడవ సమావేశం (ఎంసి13) ఫిబ్రవరి 26-29 తేదీలలో జరుగుతున్నది. ఈ సమావేశాలలో ప్రతి దేశం తన అజెండాను ముందు పెట్టి దానికి మద్దతు కూడగడు తున్నది. రాజధాని ఢిల్లీలో సమావేశమయ్యేందుకు బయలు దేరిన రైతులను ఒక వైపు పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో ఢిల్లీకి రెండువందల కిలోమీటర్ల దూరంలో ఫిబ్రవరి 13 నుంచి హర్యానా బీజేపీ ప్రభుత్వం నిలువరించింది. ఆటంకాలను అధిగ మించి ముందుకు వస్తే అడ్డుకునేందుకు రోడ్ల మీద కందకాలు, శత్రుదేశం దండెత్తి వచ్చినపుడు ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన మాదిరి అన్ని చర్యలతో ఢిల్లీలో నరేంద్రమోడీ ప్రభుత్వ పోలీసులు కాచుకొని ఉన్నారు. ఐరోపాలో అనేక దేశాల్లో రైతులు తమ సమస్యల మీద ఉద్య మిస్తున్నారు. డబ్ల్యుటిఓ నిబంధనలు రైతాంగానికి నష్టదాయకంగా ఉన్నందున దాన్నుంచి తప్పుకోవా లని దేశమంతటా రైతులు వివిధ రూపాల్లో డిమాండ్‌ చేశారు. ఈ పూర్వరంగంలో అబుదాబీ లో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారనుం ది. గతంలో మాదిరి మన ప్రభుత్వం లొంగిపో తుందా? దేశ పౌరుల ప్రయోజనాలను కాపాడుతుందా ?
ప్రపంచ వాణిజ్య సంస్థ పేరులోనే కార్పొరేట్ల వాణిజ్య ప్రయోజనాలను కాపాడేందుకు ఏర్పడిందన్న భావం ధ్వనిస్తున్నది. ప్రతిదీ లాభనష్టాల లెక్కలు తప్ప వాటికి మరొకటి పట్టదు.అక్కడ కూడా పేద-ధనిక దేశాల పెనుగులాటే జరుగు తున్నది. తమకు అనుకూలంగా ఉంటే డబ్ల్యుటిఓ నిబంధనలను అమలు జరపాలని ధనిక దేశాలు పట్టుబడతాయి. లేదనపుడు దాన్ని పక్కనపెట్టి విడివిడిగా దేశాలతో ఒప్పందాలు చేసుకుంటు న్నాయి. మొత్తంగా చూసినపుడు ధనిక దేశాలకు అనుకూలం గానే ఆ సంస్థ నిబంధనలు ఉన్నాయి. వాటిని సంస్కరించాలని పేద దేశాలు పట్టుబడుతుండగా మరింతగా తమకు అనుకూ లంగా మలచుకోవాలని ధనిక దేశాలు చూస్తున్నాయి. అందుకే అనేక అంశాల మీద దశాబ్దాల తరబడి ఒప్పందాలు కుదరక ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. కతార్‌లోని దోహాలో 2001లో ప్రపంచ వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అందుకే వీటిని దోహా దఫా చర్చలు అని పిలుస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు అబూదాబీ వరకు పదమూడు సార్లు మంత్రులు చర్చలు జరిపారు. వ్యవసాయ సబ్సిడీలకు సంబం ధించి 2008లో ఏర్పడిన ప్రతిష్ఠంభన ఇప్పటికీ కొనసాగుతోంది. ముగింపు పలకాలని 2015లో అమెరికా కోరింది. చర్చలకు కాలం చెల్లిందని, దోహా దఫా ముగిసినట్లేనని 2017లో అనేక మంది విశ్లేష కులు వ్యాఖ్యానించారు. అయితే నైరోబీలో 2015లో జరిగిన మంత్రుల పదవ సమావేశంలో సంప్రదిం పులు కొనసాగించాలని సభ్యులందరూ చెప్పి నందున కొనసాగుతాయని డబ్ల్యుటిఓ ప్రకటిం చింది. తరువాత కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.
ప్రపంచ వాణిజ్య సంస్థ రూపొందించిన నిబంధనల ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు తమ వ్యవసాయ ఉత్ప త్తుల మొత్తం విలువలో ఐదు, వర్ధమాన దేశాలు పది శాతం వరకు సబ్సిడీలు ఇవ్వవచ్చు.భారత్‌, చైనా వంటి దేశాలు అంతకు మించి ఎక్కువే ఇస్తున్నాయని, భారత్‌ 60-70శాతానికి సమంగా ఇస్తున్నట్లు ఆరోపించిన అమెరికా ఆ మేరకు డబ్ల్యుటిఓకు ఫిర్యాదు చేసింది. అదే విధంగా ప్రభుత్వం ఆహార ధాన్యాలను నిల్వచేయటాన్ని దానికోసం ఎఫ్‌సిఐ నిర్వహణ, ప్రజాపంపిణీ వ్యవస్థలను కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈ కారణంగానే అమెరికా, తదితర ధనిక దేశాలను సంతుష్టీకరించేందుకు వీటికి ఎసరు పెట్టే ఎత్తుగడలో భాగంగా మూడు సాగు చట్టాలను రాష్ట్రాలతో సంప్రదించ కుండా, పార్లమెంటరీ కమిటీకి పంపకుండా హడావుడిగా 2020లో ఆమోదించిన సంగతి తెలిసిందే. వాటిని వెనక్కు తీసుకున్న తరువాత ఇప్పుడు కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటం కుదిరేది కాదని, కావాలంటే మూడు రకాల పప్పులు, పత్తి, మొక్కజొన్నలను ఐదేండ్ల పాటు కనీస మద్దతు ధరలకు కొంటామని, అది కూడా రైతులు పంటమార్పిడి పద్దతిని అనుసరిస్తేనే అనే షరతు పెట్టారు. దీనికి అంగీకరిస్తే రైతుల కొంప కొల్లేరే.
మన దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధితో పాటు రాబడి కల్పిస్తున్నది పాడి పరిశ్రమ. దీనికి కూడా ధనిక దేశాలు ఎసరు పెట్టాయి. డబ్ల్యుటిఓ పేరుతో పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని వత్తిడి చేస్తున్నాయి. ఆ ప్రమాదం మెడ మీద కత్తిలా వేలాడుతూనే ఉంది. స్టాటిస్టా సంస్థ సమాచారం ప్రకారం ఐరోపా యూనియన్‌లోని 27 దేశాల జనాభా 49 కోట్లు కాగా ఆక్కడ పాల ఉత్పత్తి 2023లో 14.3 కోట్ల టన్నులు, నూటనలభై కోట్ల మంది ఉన్న మన దేశం లో పది కోట్ల టన్నులు, అమెరికాలో 10.4 కోట్ల టన్నులు, చైనాలో 5 కోట్ల టన్నులు ఉంది. కేవలం 52లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్‌ రెండు కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తున్నది. ఒక్క చైనా మినహా మిగిలిన దేశాలన్నీ పెద్ద ఎత్తున పాలు, పాల ఉత్ప త్తులకు సబ్సిడీలు ఇచ్చి కారుచౌకగా మన దేశంలో కుమ్మరిం చాలని చూస్తున్నాయి. అదే జరిగితే పాడి రైతులు కుదేలు కావటం ఖాయం. గతంలో రైతులు, పారిశ్రామిక, వాణిజ్యవేత్తల నుంచి వచ్చిన వత్తిడి, దానిలో అమెరికా భాగస్వామిగా లేనందున ఆర్‌సిఇపి ఒప్పందంలో చేరేందుకు మన దేశం తిరస్కరించింది. లేకుంటే ఇప్పటికే న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా నుంచి పాల ఉత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా వచ్చి ఉండేవి. వచ్చే 20 సంవత్సరాల వరకు పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకో కుండా ఉంటేనే మన పరిశ్రమ మనుగడలో ఉంటుందని ఒక నివేదిక పేర్కొన్నది. పదమూడు సంవత్సరాల పాటు అముల్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేసి 2023 చివరిలో తప్పుకున్న ఆర్‌ఎస్‌ సోధీ దిగుమతుల గురించి హెచ్చరించారు. అమెరికా, ఐరోపాయూనియన్‌, ఇతర దేశాలతో స్వేచ్చావాణిజ్య ఒప్పం దాలు, వాటి ఉత్పత్తులకు అనుమతి ఇస్తే పరిస్థితిని ఊహించ లేమని కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. న్యూజిలాండ్‌లో స్థానిక అవసరాల కంటే 14 రెట్లు ఎక్కువ ఉత్పత్తి జరుగుతోందని వారు మనదేశం మీద కన్నువేశారని చెప్పారు. మన దేశంలో సగానికి పైగా పాడి పరిశ్రమ అసంఘటిత రంగంలో ఉన్నందున ముందు రైతులు దెబ్బ తింటారు.
పాడి తరువాత మనదేశంలో కోళ్ల పరిశ్రమ ముఖ్యమైనది. ఈ రంగంలో తన ఉత్పత్తులను కుమ్మరించాలని అమెరికా చూస్తున్నది. ప్రపంచ వాణిజ్య సంస్థలో మన మీద దాఖలు చేసిన కేసులో అమెరికా గెలిచింది. ఆ సాకుతో కోళ్ల ఉత్పత్తుల దిగుమతి పన్నును భారీగా తగ్గించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అంగీకరించింది. గతంలో యుపిఏ ప్రభుత్వం అమెరికాలో వచ్చి న బర్డ్‌ఫ్లూ కారణంగా అమెరికా నుంచి దిగుమతులపై 2007 లో నిషేధం విధించింది. వ్యాధి తగ్గిన తరువాత కూడా దాన్ని ఎత్తివేయలేదంటూ అమెరికా కేసు దాఖలు చేసింది.దాని మీద 2014 అక్టోబరులో తీర్పు వచ్చింది. తొలి రోజుల్లో అమలు చేసేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అంగీకరించకపోయినా, వాణిజ్య ఆంక్షలకు పూనుకుంటామని అమెరికా బెదిరించటంతో దిగుమతులతో పాటు అప్పటి వరకు ఉన్న పన్ను మొత్తాన్ని ఐదు శాతానికి తగ్గించేందుకు 2017లో మోడీ అంగీకరించారు. మన దేశంలోని కోళ్ల పరిశ్రమ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించటంతో దిగు మతులు ప్రారంభం కాలేదు. దీనికి ప్రతిగా మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ఇస్తున్న 600 కోట్ల డాలర్ల మేర రాయితీ పన్ను డోనాల్డ్‌ ట్రంప్‌ రద్దు చేసి మన ఎగు మతులను దెబ్బతీశాడు. దీనితో పాటు మరికొన్ని వివా దాలు కొనసాగుతుండటంతో కోళ్ల ఉత్పత్తుల దిగుమ తులు అమలు కాలేదు. ఇప్పటికీ అదే పరిస్థితి. ఈలోగా మన రైతులు అమెరికా కోడి కాళ్ల దిగుమతులను అనుమ తించకుండా నిరోధించాలని సుప్రీం కోర్టుకు వెళ్లారు, ఆ కేసు ఇంకా తేలలేదు.ప్రస్తుతం అమెరికా కోళ్ల ఉత్పత్తు లపై దిగుమతి పన్ను వందశాతం ఉంది. అయినప్పటికీ అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే మన మార్కెట్‌ ధరల కంటే తక్కువకు విక్రయించవచ్చని చెబుతున్నారు. మన వినియోగదారులకు తక్కువ ధర కావాలి గనుక మాంసం ఎక్కడిదన్నదానితో నిమిత్తం ఉండదు. మనదేశంలో ఒక టన్ను కోడి మాంసానికి 1,800 డాలర్లు ఖర్చు అవు తుంది. అదే అమెరికాలో 700 నుంచి 800 డాలర్లు, ఈ లెక్కన వందశాతం పన్ను చెల్లించి దిగుమతి చేసుకున్నప్పటికీ 1,500- 1,600 డాలర్లకే అందించవచ్చు.అమెరికా పౌరులు కోడి కాళ్లను తినరు గనుక మనకు మరింత చౌకగా దొరుకుతాయి.
వ్యవసాయంతో పాటు అన్ని రకాల సబ్సిడీలను పరిమితం చేయాలి లేదా తొలగించాలన్నది ప్రపంచ వాణిజ్య సంస్థ నిబం ధన. ఆ దిశగానే పదేండ్ల మోడీ పాలన సాగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బడ్జెట్‌, జిడిపిలతో పోలిస్తే వాస్తవ కేటాయింపు తగ్గుతున్నది. ఉదాహరణకు ఎరువుల సబ్సిడీ తీరు తెన్నులు చూద్దాం. యుపిఏ పాలనా కాలంలో 2008-2009 నుంచి 2013-14వరకు ఆరేండ్ల కాలంలో సగటున ఏడాదికి ఎరువులకు ఇచ్చిన సబ్సిడీ రు.59వేల కోట్లు. నరేంద్రమోడీ ఏలుబడి తొలి ఆరు సంవత్సరాల సగటు 71వేల కోట్లు ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థ సబ్సిడీలకు తీసుకున్న ప్రాతిపదికతో మనదేశంతో సహా అనేక దేశాలు నష్టపోతున్నాయి. 1986- 1988లో ఉన్న ధరలను ప్రాతిపదికగా తీసుకొని వర్ధమాన దేశాలలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల విలువలో పదిశాతం సబ్సిడీలుగా ఇవ్వవచ్చు. అదే ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ కాలంలో పెరిగిన ద్రవ్యోల్బణం, పెరిగిన విలువను పరిగణన లోకి తీసుకోవాలని వర్ధమాన దేశాలు కోరుతున్నాయి. నిబంధ నల్లో పీస్‌ క్లాజ్‌ అని ఒకటి ఉంది. దీన్నే సంధి కాలం అని కూడా అంటున్నారు. దీని ప్రకారం ఏవైనా ప్రభుత్వాలు సేకరిం చిన ఆహార ధాన్యాలను ఎగుమతి చేయకూడదు. అయితే గతే డాది, ఈ ఏడాది దేశంలో ఆహార ధరలు పెరిగిన కారణంగా కేంద్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో బియ్యం, గోధుమలను విక్రయిస్తున్నది. దీన్ని ఇతర దేశాలు తప్పు పడుతున్నాయి. ఇవి అంతర్జాతీయ మార్కెట్లకు చేరుతున్నాయని, ఇది నిబంధనలను ఉల్లంఘించటమే అని అభ్యంతరాలు తెలుపుతున్నాయి.
ప్రపంచ వాణిజ్య సంస్థలో తనకున్న పలుకబడిని ఉపయో గించుకొని అమెరికా రక్షణ చర్యలకు పాల్పడుతోంది. అబుదాబీ సమావేశంలో కూడా ఈ దిశలోనే తన అజెండాను ముందుకు నెట్టవచ్చు. ఈ సంస్థ అప్పీళ్ల విచారణ కోర్టులో న్యాయమూర్తుల నియామకాన్ని అడ్డుకొంటున్న కారణంగా 2019 నుంచి ఎలాంటి విచారణలూ లేవు. ఏడాదికేడాది వివాదాలు పెరుగు తున్నాయి. అమెరికా ప్రయోజనాలకే అగ్ర పీఠం అనే పద్దతిలో ఆలోచించటం, ఆ దిశగా ముందుకు పోవటం ఇటీవలి కాలంలో పెరిగింది. దానిలో భాగంగానే మనకు ఉపయోగపడని, మన మాట చెల్లుబాటుగాని డబ్ల్యుటిఓ నుంచి వైదొలగాలని అమెరి కాలోని కొందరు తమ ప్రభుత్వం మీద వత్తిడి తెస్తున్నారు. ఇతర దేశాల ఉత్పత్తుల మీద దిగుమతి సుంకాలు విధిస్తూ బస్తీమే సవాల్‌ అంటున్నారు. ప్రపంచీకరణ తెచ్చిన తిరోగమన పరి ణామాలు, పర్యవసానాల పూర్వరంగంలో ప్రపంచీకరణకు వ్యతి రేకత వెల్లడవుతున్నది. ఈ కారణంగానే డబ్ల్యుటిఓలో సంస్క రణలు తేవాలన్న వాంఛకు మద్దతు పెరుగుతున్నది.తనకు దక్కని ప్రయోజనాలను అమెరికా అంగీకరిస్తుందా ? ప్రపంచ వాణిజ్య సంస్థను ఒక ఆయుధంగా మలచుకొని ఇతర దేశాలను దెబ్బతీస్తుందా అన్నది చూడాల్సి ఉంది. అబుదాబీలో ఏం జరుగనుందో అని అన్ని దేశాలూ ఎదురు చూస్తున్నాయి.
ఎం కోటేశ్వరరావు
8331013288