ముంబయి జట్టులో శ్రేయస్‌!

ముంబయి జట్టులో శ్రేయస్‌!– రంజీ సెమీఫైనల్స్‌కు ఎంపిక
ముంబయి : భారత మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ రంజీ ట్రోఫీలో ఆడనున్నాడు. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్‌ అయ్యర్‌ తమిళనాడుతో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబయి తరఫున ఆడనున్నాడు. 16 మందితో కూడిన ముంబయి రంజీ జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు కల్పించారు. ముంబయిలోని శరద్‌ పవార్‌ క్రికెట్‌ అకాడమీ గ్రౌండ్‌లో మార్చి 2 నుంచి తమిళనాడు, ముంబయి రంజీ సెమీఫైనల్‌ జరుగనుంది. క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో నిరాశపరిచిన సుర్యాన్షు షెడ్జె స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ఈ మేరకు భారత మాజీ పేసర్‌ రాజు కులకర్ణి సారథ్యంలోని సెలక్షన్‌ కమిటీ జట్టును మంగళవారం ప్రకటించింది. గాయం, వరుస వైఫల్యాలతో భారత టెస్టు నుంచి ఉద్వాసనకు గురైన శ్రేయస్‌ అయ్యర్‌.. రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో వ్యక్తిగతంగా మంచి ఇన్నింగ్స్‌ ఆడటంతో పాటు ముంబయిని ఫైనల్స్‌కు చేర్చటంలో కీలక పాత్ర పోషిస్తాడని ఆ జట్టు భావిస్తోంది. ముంబయి రంజీ జట్టుకు అజింక్య రహానె కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. పృథ్వీ షా, ముషీర్‌ ఖాన్‌, శార్దుల్‌ ఠాకూర్‌, తుషార్‌ దేశ్‌పాండే, ధవల్‌ కులకర్ణి వంటి కీలక ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.