నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థల తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ఈ స్కాంకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనపై ఎలాంటి బలవంతపు (అరెస్ట్ లాంటివి) చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని… పలుమార్లు విచారణకు హాజరైన తర్వాత గతేడాది మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె తరపు న్యాయవాది వందన సెఘల్ మొత్తం 105 పేజీలతో కూడిన రిట్ పిటిషన్(క్రిమినల్)ను దాఖలు చేశా రు. ఈడీ ఆఫీసుకు మహిళను విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై పిటీషన్లో పేర్కొన్నారు. గతంలో ఈ పిటి షన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం… కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీల పిటిషన్లతో ట్యాగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీ వల ఈ పిటిషన్లు మరోసారి జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్‌తో కూడిన ద్విసభ ధర్మాసనం ముందుకు రాగా… ఎందుకు అన్ని పిటిషన్లను కలిపి విచారించాలని ధర్మాసనం ప్రశ్నించింది. అన్ని పిటిషన్లు దేనికి అది వేరని, ఒకే అంశానికి సంబంధించినవి ఎలా అవుతాయని కీలక వ్యాఖ్యలు చేసింది. అన్ని పిటిషన్లు కలిపి విచారణ చేపట్టా లని తాము భావించడం లేదని వ్యాఖ్యానించింది.కాగా ఈ పిటిషన్ల ను డిట్యాగ్ చేస్తామని అభిప్రాయపడ్డ ధర్మాసనం… నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ, కవిత పిటిషన్లలో ఈ రోజు దేనిపై విచారణ చేపడతారో స్పష్టత రావాల్సి ఉంది.