– సీఎం రేవంత్ ఫైటర్…జగన్ ఆక్సిడెంటల్ సీఎం : టీపీసీసీ అధికార ప్రతినిధి బండ్ల గణేష్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆర్‌కే రోజా ఓ డైమాండ్ రాణి అని టీపీసీసీ అధికార ప్రతినిధి బండ్ల గణేష్ ఎద్దేవా చేశారు. అలాంటి నాయకులు కూడా సీఎం రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ‘రేవంత్ ఫైటర్, జగన్ ఆక్సిడెంటల్ సీఎం. ఆయన నాన్న చనిపోతే సీఎం అయ్యారు. మంత్రి రోజా ఐటం రాణి. పులుసు వండి పెట్టావ్ కాబట్టి పులుసు పాప అయ్యావు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాటా ్లడారు. మేడిగడ్డకు వెళ్లి బీఆర్‌ఎస్ నాయకులు ఏం చేస్తారని ప్రశ్నించారు. మేడిగడ్డను మీరు ఎలా నాశనం చేశారో చూసి వస్తారా? అని నిలదీశారు. అది కూలిపోతే తమదే బాధ్యత అంటూ బీఆర్‌ఎస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మూడు పిల్లర్లు ముప్పై పిల్లర్లు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతున్నదని తెలిపారు. తండ్రి పేరును అడ్డం పెట్టుకునే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. ‘కేసీఅర్ గారి అబ్బాయిగా తప్పా ఆయనకు ఎలాంటి గుర్తింపు లేదు. రేవంత్ పోరాట యోధుడు. బీఆర్‌ఎస్ పెట్టిన చిత్ర హింసలు, మానసిక క్షోభం అధిగమించి ముఖ్యమంత్రి అయ్యారు. కేటీఆర్ చుట్టూ ఈగో వైఫైలాగా ఉంటుంది. రేవంత్ సీఏం కావడంతో కేటీఆర్ భాధపడుతున్నాడు’ అని ఎద్దేవా చేశారు.
వందల యూ ట్యూబ్ ఛానెల్స్ పెట్టి రేవంత్‌ను తిట్టిస్తున్నారు, కేటీఆర్ కాల్ చేస్తే బీఆర్‌ఎస్ అభ్యర్థులు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో సీఎంకు చెప్పు చూపిస్తే, ఎన్‌కౌంటర్ చేయించేవారనీ, రాళ్లతో కొట్టి చంపించే వాళ్లని అన్నారు. కేటీఆర్‌ను సీఎంగా ప్రకటిస్తే బీఆర్‌ఎస్‌కు మూడు సీట్లు కూడా రాకపోయేవి వ్యాఖ్యానించారు. అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి కేటీఆర్ అక్కడకు వెళ్ళారని ఆరోపించారు. ఆమన హయాంలో పని చేసిన అధికారుల దగ్గర కోట్లాది రూపాయల నల్ల ధనం దొరుకుతున్నదని చెప్పారు.