– హాజరు పాఠశాలలో…
– చదివేది కోచింగ్ సెంటర్‌లో
– సీబీఎస్‌ఈ సర్వేలో బయటపడిన చేదునిజం
– జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలే కారణమంటున్న విద్యావేత్తలు
తన అనుబంధ పాఠశాలల్లో డమ్మీ విద్యార్థులు ఉన్నారని సీబీఎస్‌ఈ గుర్తించింది. దేశంలో అతి పెద్ద విద్యా బోర్డుగా కొనసాగుతున్న సీబీఎస్‌ఈకి 28 వేల అనుబంధ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో వివిధ రాష్ట్రాలకు చెందిన 34 పాఠశాలలను సీబీఎస్‌ఈ ఇటీవల తనిఖీ చేసింది. వీటిలో 23 పాఠశాలల్లో డమ్మీ విద్యార్థులు ఉన్నారని తేల్చింది.
న్యూఢిల్లీ : తన అనుబంధ పాఠశాలల్లో డమ్మీ విద్యార్థులు ఉన్నారని సీబీఎస్‌ఈ గుర్తించింది. దేశంలో అతి పెద్ద విద్యా బోర్డుగా కొనసాగుతున్న సీబీఎస్‌ఈకి 28 వేల అనుబంధ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో వివిధ రాష్ట్రాలకు చెందిన 34 పాఠశాలలను సీబీఎస్‌ఈ ఇటీవల తనిఖీ చేసింది. వాటిలో 23 పాఠశాలల్లో డమ్మీ విద్యార్థులు ఉన్నారని తేల్చింది.11, 12 తరగతులకు చెందిన ఈ విద్యార్థులు వాస్తవానికి ఆయా పాఠశాలల్లో చదవడం లేదు. ఈ రెండు సంవత్సరాలు వారు పూర్తిగా కోచింగ్ కేంద్రాల్లోనే విద్యను అభ్యసిస్తున్నారు. వారి హాజరు పట్టీలను పాఠశాలలు తారుమారు చేస్తూ హయ్యర్ సెకండరీ బోర్డు పరీక్షలకు పంపుతున్నాయి. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలే ఈ పరిస్థితికి కారణమని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ పరీక్షల కారణంగానే కోచింగ్ సెంటర్లకు డిమాండ్ పెరిగిందని వారు తెలిపారు.
తాను ఓ పాఠశాలకు వెళ్లానని, 9, 10 తరగతుల్లో 60 మంది విద్యార్థులు మాత్రమే కనిపించారని, కానీ 11, 12 తరగతులకు వచ్చే సరికి ఆ సంఖ్యను 500కు పెంచేశారని తనిఖీ బృందం సభ్యుడొకరు చెప్పారు. తనిఖీ బృందం వెళ్లేసరికి 11వ తరగతిలో ఒక్కరు కూడా లేరని, 12వ తరగతిలో 50 మంది కన్పించారని తెలిపారు. డమ్మీ విద్యార్థులను గుర్తించిన సీబీఎస్‌ఈ 23 పాఠశాలలకు నోటీసులు జారీ చేసింది. సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం బోర్డు పరీక్ష రాయాలంటే విద్యార్థికి కనీసం 75% హాజరు తప్పనిసరి.
పోటీ పరీక్షల కోసమే…
వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు డమ్మీ విద్యార్థులు కోచింగ్ సంస్థల్లో చేరుతున్నారు. వారికి పోటీ పరీక్షల కోచింగ్‌తో పాటు హయ్యర్ సెకండరీ సిలబస్ కూడా చెబుతామని ఆ సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చచెబుతున్నాయి. తాము ‘ఒప్పందం’ కుదుర్చుకున్న పాఠశాలల్లో విద్యార్థులను చేర్చాలని వారికి సూచిస్తున్నాయి. పాఠశాల తరగతులకు విద్యార్థులు హాజరు కావాల్సిన అవసరం లేదని, బోర్డు పరీక్షకు హాజరయ్యేలా చూస్తామని నమ్మిస్తున్నాయి. అటు పాఠశాలలు కూడా మౌలిక సదుపాయాల పైన, అదనపు ఉపాధ్యాయుల నియామకం పైన ఎలాంటి ఖర్చు చేయకుండానే డబ్బులు మూటకట్టుకుంటున్నాయి.
రెగ్యులర్ పాఠశాలల్లో చదువుకుంటూ టాప ర్లుగా నిలుస్తున్న విద్యార్థులు డమ్మీ స్కూల్స్‌కు బదిలీ అవుతున్నారు. వారు 12వ తరగతి బోర్డు పరీక్షపై దృష్టి సారించడం లేదు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష, జాతీయ ప్రవేశ-అర్హత పరీక్ష, ఉమ్మడి యూనివర్సిటీ ప్రవేశ పరీక్షకు సన్నద్ధం అవుతున్నారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు బోర్డు పరీక్షను కేవలం అర్హత పరీక్షగా మార్చేయడమే దీనికి కారణం. అంటే ఈ పరీక్షలో గట్టెక్కితే చాలు…కాలేజీలో ప్రవేశానికి అర్హత పొందుతారు. పోటీ పరీక్షలో వారు సాధించిన మార్కులే దీనికి ఆధారం.
ఈ నేపథ్యంలో అడ్మిషన్ల సమయంలో 12వ తరగతి బోర్డు పరీక్షలో సాధించిన స్కోరుకే ప్రాధాన్యత ఇవ్వాలని తనిఖీ బృందం సభ్యురాలైన పాఠశాల ప్రిన్సిపాల్ సూచించారు. దీనివల్ల డమ్మీ విద్యార్థుల రాకెట్‌ను అడ్డుకోవచ్చునని చెప్పారు.
ఉత్తీర్ణత కోసమే శిక్షణ
కేంద్ర యూనివర్సిటీల్లో సాధారణ కోర్సుల్లో ప్రవేశానికి సీయూఈటీ, వైద్య-దంత కళాశాలల్లో సీట్లకు నీట్, ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి జేఈఈ తప్పనిసరి అవుతోంది. గతంలో బోర్డు పరీక్ష ఫలితాల ఆధారంగా విద్యార్థులు కాలేజీల్లో ప్రవేశం పొందేవారని, ఇప్పుడు పరీక్షల్లో ఉత్తీర్ణులవడానికి విద్యార్థులకు కోచింగ్ కేంద్రాలు శిక్షణ ఇస్తున్నాయని విద్యావేత్త ప్రిన్స్ గజేంద్ర బాబు వ్యాఖ్యానించారు. ఈ దుస్థితికి తల్లిదండ్రులు కూడా బాధ్యులేనని ఓ పాఠశాల మాజీ ప్రిన్సిపాల్ ఉషా రామ్ చెప్పారు. కొన్ని పాఠశాలలు తమ ప్రాంగణాలలోనే కోచింగ్ కేంద్రాలను నడిపేందుకు అనుమతిస్తున్నాయని అన్నారు.