ప్రతిస్పందన అదే స్థాయిలో ఉంటుంది

ప్రతిస్పందన అదే స్థాయిలో ఉంటుంది– పశ్చిమ దేశాలకు రష్యా హెచ్చరిక
మాస్కో : ఘనీభవింపజేసిన రష్యన్‌ ఆస్తులను కైవశం చేసుకోవటం అంటూ జరిగితే రష్యా ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో ఉంటుందని రష్యా ఆర్థిక మంత్రి అన్‌టన్‌ సిల్యూనోవ్‌ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. ఓ వార్తా సంస్థకు ఆయన సోమవారం ఇంటర్వ్యూ ఇచ్చారు. పశ్చిమ దేశాలకూ ఇప్పటికీ రష్యాలో ఆస్తులు ఉన్నాయనీ, ఆయా దేశాల్లో ఘనీభవింపజేసిన రష్యా ఆస్తులను కైవశం చేసుకోవటమంటూ జరిగితే వాళ్ళ ఆస్తులకు కూడా అదే గతి పడుతుందని ఆయన అన్నారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలయ్యాక రష్యా సెంట్రల్‌ బ్యాంకుకు చెందిన 300బిల్లియన్ల ఆస్తులను రష్యాకు తరలించకుండా పశ్చిమ దేశాలు అడ్డుకున్నాయి. ఈ ఆస్తులను కైవశం చేసుకుని, వీటిని ఉక్రెయిన్‌కు సహాయంగా అందించాలని అమెరికా, బ్రిటన్‌లు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో యూరోపియన్‌ యూనియన్‌ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
ఈ ఆస్తులను కైవశం చేసుకునే బదులుగా యూరో క్లియర్‌ క్లియరింగ్‌ హౌస్‌లో చిక్కుబడిపోయిన రష్యా ఆస్తులపైన వచ్చే వడ్డీని ఉక్రెయిన్‌కు అందించాలని యూరోపియన్‌ యూనియన్‌ భావిస్తోంది. రష్యా ఆస్తులను పూర్తిగా కైవశం చేసుకుంటే అది పశ్చిమ దేశాల ఫైనాన్షియల్‌ వ్యవస్థ పైనుండే విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని, యూరో కరెన్సీపైన నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తుందని అనేక యూరోపియన్‌ దేశాలు హెచ్చరిస్తున్నాయి.
రష్యాలో పశ్చిమ దేశాల ఆస్తుల గురించి రష్యా ఆర్థిక మంత్రి అన్‌టన్‌ సిల్యూనోవ్‌ వివరించనప్పటికీ అవి స్థూలంగా విదేశాల్లో ఘనీభవింపజేసిన రష్యా ఆస్తులకు సమానంగా ఉంటాయని ఆర్‌ఐఏ నొవోస్తి వార్తాసంస్థ లెక్కగట్టింది. రష్యా ఆర్థిక వ్యవస్థలో యూరోపియన్‌ యూనియన్‌, జీ 7, ఆస్ట్రేలియా, స్విట్జర్‌లాండ్‌ పెట్టిన ప్రత్యక్ష పెట్టుబడులు 2022 చివరకల్లా 288 బిల్లియన్లదాకా ఉంటాయని ఈ వార్తాసంస్థ గత నెల్లో విడుదల చేసిన ఒక రిపోర్ట్‌లో పేర్కొంది