బీఆర్ఎస్ కు బిగ్ షాక్..

– పార్టీని వీడనున్న ముఖ్య నాయకులు
– గంట్లకుంట లో రహస్య సమావేశం
– కాంగ్రెస్ పార్టీ లోకే మొగ్గు.. కుదరకపోతే బీజేపీ లోకి
నవతెలంగాణ – పెద్దవంగర
పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పార్టీ వీడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పెద్దవంగర మండలంలోని పలువురు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నారు. సుమారు వంద మంది నాయకులు గంట్లకుంట గ్రామంలోని ఓ కీలక నాయకుడి ఇంట్లో సమావేశమై త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం. మొదటినుండి బీటఆర్ఎస్ పార్టీలో పనిచేసిన నాయకులు, ఎర్రబెల్లి దయాకర్ రావు నమ్మిన నాయకులు సైతం పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీ బలోపేతం కోసం, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపు కోసం కృషి చేసినా పార్టీలో తగిన గుర్తింపు లేదని, అటు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ బలహీన పడడం, దయాకర్ రావు పై అసంతృప్తితో పార్టీని వీడుతున్నట్లు మండలంలో చర్చ జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీకే మొగ్గు.. కుదరకపోతే బీజేపీ లోకి: బీఆర్ఎస్ ను వీడనున్న నాయకులు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. కుదరకపోతే భారతీయ జనతా పార్టీలో చేరేందుకు నాయకులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు గెలుపు పై వ్యూహాలు రచిస్తున్నారు. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ను వీడిన కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్తారా? కుదరకపోతే బీజేపీ లోకి వెళ్తారా అని మండలంలో చర్చ నడుస్తుంది…