బండి ప్రజాహిత యాత్రపై కోడిగుడ్ల దాడి

బండి ప్రజాహిత యాత్రపై కోడిగుడ్ల దాడినవతెలంగాణ-భీమదేవరపల్లి
కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజరు నిర్వహిస్తున్న ప్రజాహిత యాత్రపై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. నాలుగు రోజులుగా బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల మధ్య పోటాపోటీగా అడ్డగింతలు, పరస్పర ఆరోపణలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం, రసూల్‌పల్లి మీదుగా యాత్ర చేపట్టి కొత్తకొండ హరిత హోటల్‌లో బండి సంజరు బస చేశారు. ఈ సందర్భంగా 350 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. బుధవారం ఉదయం యాత్రలో భాగంగా కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో పూజలు చేశారు. ముస్తఫాపూర్‌ గట్ల నర్సింగాపూర్‌ గ్రామాల మీదుగా యాత్ర చేసి మాజీ ప్రధాని, భారతరత్న దివంగత పీవీ నరసింహారావు ఇంటికి చేరుకుని పీవీ కుటుంబ సభ్యులను సన్మానించారు. అనంతరం ఆయన కాన్వాయి ముల్కనూరు వైపు బయలుదేరగా.. బస్టాండ్‌ సమీపంలోని సందులో నుంచి కోడిగుడ్లు కాన్వారుపై విసిరారు. కోడిగుడ్లు కాన్వారు కెమెరామెన్‌ పై పడ్డాయి. పోలీసులు అప్రమత్తమై వెతకగా ఎవరూ దొరకలేదు. దాంతో బండి సంజరు ముమ్మాటికి పోలీసుల నిఘా వైఫల్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజరు యాత్ర ఎల్కతుర్తి వైపు వెళ్ళగానే ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మధ్య పోటాపోటీ ప్రసంగాలు, పోలీసులు భారీగా మోహరించడం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.