పసుపునకు రికార్డు ధర క్వింటాకు రూ.14,255

పసుపునకు రికార్డు ధర క్వింటాకు రూ.14,255నవతెలంగాణ-నిజామాబాద్‌ సిటీ/ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డ్‌లో ఈ సీజన్‌లో పసుపు ధర అధికంగా రూ.14,255 పలికిందని మార్కెట్‌ యార్డ్‌ సెక్రెటరీ వెంకటేశం బుధవారం తెలిపారు. వన్నెల్‌(బి) గ్రామానికి చెందిన రైతు పన్నాల మహిత తండ్రి రాజేందర్‌కు చెందిన పసుపు పంట 17 క్వింటాళ్లు విక్రయానికి మార్కెట్‌ యార్డుకు తీసుకురాగా.. రికార్డు ధర రూ.14,255 పలికినట్టు తెలిపారు. ఈ సీజన్‌లో ఎక్కువ ధర అని తెలిపారు.
పసుపునకు రూ.14 వేల ధర దక్కడం సంతోషకరం, ఎక్స్‌ (ట్విట్టర్‌)లో స్పందించిన సీఎం రేవంత్‌
నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో పసుపునకు రూ.14 వేల మద్ధతు ధర దక్కడం సంతోషకరమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఆయన స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే రైతులకు శాశ్వత మేలు జరుగుతుందని అభిప్రాయ పడ్డారు. తక్షణం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.
బాలికల సాఫ్ట్‌ బాల్‌ జట్టును అభినందించిన సీఎం
బంగారు పతకం సాధించిన తెలంగాణ సాఫ్ట్‌ బాల్‌ బాలికల జట్టును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందించారు.ఈ నెల 21నుంచి 25 వరకు, బీహార్‌లోని పాట్నాలో జరిగిన 41వ జూనియర్‌ నేషనల్‌ సాఫ్ట్‌ బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు బంగారు పతకం సాధించింది. బుధవారం సచివాలయంలో సీఎంను కలిసిన సందర్భంగా వారికి ఆయన అభినందనలు తెలిపారు.