– చైర్మెన్‌గా పోతంశెట్టి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మెన్‌గా మాయ దశరథ
– అసంతృప్తితో కౌన్సిలర్ పచ్చర్ల హేమలత రాజీనామా
నవతెలంగాణ-భువనగిరి
యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ చైర్మెన్ పదవి కాంగ్రెస్ వశమైంది. చైర్మెన్‌గా కాంగ్రెస్‌కు చెందిన పోతంశెట్టి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మెన్‌గా మాయ దశరథ ఎన్నికయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక కోసం ఆధీకృత అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.జయశ్రీ సమక్షంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకొని మొత్తం 36 మంది సభ్యులకు.. 30 మంది హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన వెంటనే బీజేపీ నుంచి నల్లమాస సుమ.. చైర్మెన్ అభ్యర్థిగా బొర్ర రాకేష్ పేరును ప్రతిపాదించగా, ఉదయగిరి విజరు కుమార్ బలపర్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మెన్ అభ్యర్థిగా పోతంశెట్టి వెంకటేశ్వర్లు పేరును జిట్టా వేణుగోపాల్ రెడ్డి ప్రతిపాదించగా.. కైరంకొండ వెంకటేశ్వర్లు బలపర్చారు. బొర్ర రాకేష్‌కి 5 ఓట్లు, పోతంశెట్టి వెంకటేశ్వర్లుకి 17 ఓట్లు వచ్చాయి. అనంతరం పోతంశెట్టి వెంకటేశ్వర్లుని చైర్మెన్‌గా అధికారి ప్రకటించారు. తదుపరి వైస్ చైర్మెన్ ఎన్నికలో కాంగ్రెస్ నుంచి మాయ దశరథ పేరును రత్నపురం బలరామ్ ప్రతిపాదించారు. జనగాం కవిత బలపర్చారు. పోటీ ఎవరూ లేకపోవడంతో వైస్ చైర్మెన్‌గా మాయ దశరథ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు.
అసంతృప్తిలో కాంగ్రెస్ వాదులు..
వైస్ చైర్మెన్ ఎంపిక విషయంలో కాంగ్రెస్‌లో కొందరు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌన్సిలర్ పచ్చర్ల హేమలత వెంటనే రాజీనామా పత్రాలను కమిషనర్‌కు అందజేశారు. సీనియర్ కౌన్సిలర్ ప్రమోద్ కుమార్, ఆర్‌బినగర్ కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.