– దుబాయ్ జైలు నుంచి విడుదలై వచ్చిన వారికి ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శ
– ఉపాధి కల్పిస్తామని భరోసా
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్
ఉన్న ఊరిలో ఉపాధి కరువై పొట్టచేత పట్టుకొని దుబారు వలస వెళ్లి ఓ హత్య కేసులో 18ఏండ్లు అక్కడ జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలై స్వగ్రామం చేరుకున్న సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరుకు చెందిన బాధితులను బుధవారం మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు. ఎమ్మెల్యే కేటీఆర్‌ను చూడగానే బాధిత కుటుంబీకులు బోరున విలపించగా.. ఆయన వారిని ఓదార్చారు. వారి ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు. అధైర్య పడొద్దని, ఉపాధి కల్పించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భాష తెలియక తెలియని తప్పుకు 18ఏండ్లుగా జైలు శిక్ష అనుభవించిన వారిని విడిపించి స్వదేశానికి తీసుకొచ్చామన్నారు. ఇంకా ఒకరు దుబాయిలోనే శిక్ష అనుభవిస్తున్నారని, అతడిని కూడా విడిపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. న్యాయవాదులు, విలేకరులు, కేంద్ర ప్రభుత్వం ఇలా ఎంతోమంది కృషి వల్ల ఏడు సంవత్సరాల జైలు శిక్ష కాలం మిగిలి ఉండగానే నలుగురు బాధితులు స్వదేశానికి తిరిగి వచ్చారని తెలిపారు. సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. బాధితులను స్వదేశానికి తీసుకురాకడమే కాకుండా.. ఉపాధి కల్పించే బాధ్యత తనపై ఉందన్నారు. ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఉపాధి అపకాశాలు చాలా ఉన్నాయని, నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడొద్దని సూచించారు. కేటీఆర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.