హెచ్‌ఎమ్‌డీఏలో విజిలెన్స్‌ సోదాలు

Vigilance inspections in HMDA– విలువైన ఫైల్స్‌పై విచారణ 50 మంది బృందంతో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు
– చెరువులు, ప్రభుత్వ భూముల, హైరైజ్‌ పర్మిషన్లపై పరిశీలన
– పలు ఫైల్స్‌పై అనుమానాలు వ్యక్తం
–  కొంత మంది అధికారులపై కేసులు నమోదయ్యే అవకాశం
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
హెచ్‌ఎమ్‌డీఏ కార్యాలయంలో విజిలెన్స్‌ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన ఫైల్స్‌ను పరిశీలించినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు బయ టపెట్టేందుకు సిద్ధమైన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎట్టకేలకు హెచ్‌ఎమ్‌డీఏ కార్యాలయంలో విజిలెన్స్‌ అధికారులు సోదాలు చేపట్టడంతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. సచివాలయంలో హెచ్‌ఎమ్‌డీఏ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష జరుపుతున్న సమయంలోనే విజిలెన్స్‌ అధికా రులు హెచ్‌ఎమ్‌డీఏలో సోదాలు నిర్వహిం చడం చర్చనీయంశంగా మారింది. మరో రెండు రోజుల పాటు జీహెచ్‌ఎమ్‌సీ, జిల్లా టౌన్‌ ప్లానింగ్‌ కార్యాలయాల్లో సైతం సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం. గత పదేండ్లలో ఇచ్చిన పర్మిషన్లలో ముఖ్యమైన వాటిపై విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. హెచ్‌ఎమ్‌డీఏ పరిధిలో ప్రభుత్వ లెక్కల ప్రకారం సమారు 3500 చెరువులు ఆన్‌లైన్‌ డేటా నుంచి మాయమైనట్టు గుర్తించారు. అలాగే, హెచ్‌ఎమ్‌డీఏ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జా పెట్టిన వాటికి.. ప్రభుత్వ అధికారులు పర్మిషన్లు ఎలా ఇచ్చారన్నదానిపై ప్రభుత్వం పలు కీలకమైన ఫైల్స్‌పై విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టినట్టు సమాచారం. ఈ విచారణలో విలువైన ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు మాయం చేసి లేఅవుట్‌, అపార్ట్‌మెంట్స్‌ నిర్మించడానికి పర్మిషన్లు ఎట్లా ఇచ్చారన్నదానిపై ఆర తీసినట్టు తెలుస్తోంది. ఏ నిబంధనాల ప్రకారం ఇచ్చారన్నదానిపై హెచ్‌ఎమ్‌డీఏ కార్యాలయంలో విజిలెన్స్‌ అధికారులు ఒక్కో ఫైల్‌పై ఆధికారులను ప్రశ్నించారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన హెచ్‌ఎమ్‌డీఏ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ఎంత మంది అధికారులు పని చేశారు. ఏయే ఫైల్స్‌ క్లియర్‌ చేశారన్నదానిపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ హెచ్‌ఎమ్‌డీఏ కార్యాయంలో సుమారు 50 మంది విజిలెన్స్‌ అధికారుల బృందంతో ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది. హెచ్‌ఎమ్‌డీఏ ప్లానింగ్‌ డైరెక్టర్స్‌ కార్యాలయాల్లో, ప్లానింగ్‌ ఆఫీసర్స్‌, అసిస్టెంట్‌ ప్లానింగ్‌ ఆఫీసర్స్‌ను విచారించినట్టు సమాచారం. ఇందులో పలు కీలకమైన ఫైల్స్‌లో తప్పులు దొర్లినట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే తప్పుడు పర్మిషన్లు, ఆన్‌లైన్‌ పర్మిషన్లు కాకుండా, చేతి రాతలతో ఇచ్చిన పర్మిషన్లు సైతం ఉన్నట్టు సమాచారం. అక్రమ పర్మిషన్ల విషయంలో పలువురు అధికారులపై కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరో రెండు రోజులు పాటు జీహెచ్‌ఎమ్‌సీ, జిల్లా టౌన్‌ ప్లానింగ్‌ కార్యాలయాలపై సైతం విజిలెన్స్‌ సోదాలు నిర్వహించనున్నట్టు సమచారం.