– మోడీ హయాంలో భయానక పరిస్థితులు
– పాలకులే ఘర్షణలకు కారణమవుతున్నారు
– మణిపూర్, గుజరాత్ అల్లర్లే సాక్ష్యం
– కేసీఆర్‌కు ఓటేస్తే…మోడీకే ప్రయోజనం
– కేంద్రంలో లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించండి : క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మైనార్టీలు దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బ్రతికే పరిస్థితులు దాపురించాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మత సామరస్యాన్ని ప్రోత్సహించాల్సిన పాలకులే ఘర్షణలకు కారకులు అవడం దురదృష్టకరమని అన్నారు. బుధవారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా దేశంలో మైనార్టీల అభద్రతాభావ జీవనంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత భయానక పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మైనార్టీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అల్లర్లు, ఘర్షణలు జరిగితే పాలకులు అణిచివేసేవారని, కానీ ఇప్పుడు పాలకులుగా ఉన్నవారే ఘర్షణలకు కారణమవుతున్నారని చెప్పారు. దీనికి మణిపూర్, గుజరాత్ ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణలనీ, ఈ స్థితి దేశ శ్రేయస్సుకు మంచిది కాదనీ, పరమత సహనం పాటించాలని అభిప్రాయపడ్డారు. యూపీఏ పదేండ్ల కాలంలో రాహుల్‌గాంధీ కావాలనుకుంటే ప్రధానమంత్రి అయ్యేవారనీ, కానీ ఆయన ఏనాడూ పదవిని ప్రేమించలేదన్నారు. ప్రజలను ప్రేమించడం, వారందర్నీ కలిపి ఉంచడమే ఆయన లక్ష్యమని వివరించారు. దానికోసమే రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జోడో యాత్ర చేపట్టారనీ, ఇప్పుడు రెండో విడతలో మణిపూర్ నుంచి గుజరాత్ వరకు యాత్ర చేస్తున్నారని తెలిపారు. ఘర్షణలు చోటుచేసుకుంటున్న మణిపూర్‌కు ప్రధానమంత్రి, కేంద్ర హౌం శాఖ మంత్రి వెళ్లలేదనీ, రాహుల్ గాంధీ వెళ్లడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి ఘర్షణలను నిరోధించాయని గుర్తుచేశారు. తెలంగాణలో లౌకిక ప్రభుత్వం ఏర్పడిందనీ, కేంద్రంలోనూ లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. జాతీయ స్థాయి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ఔచిత్యం లేదనీ, ప్రాంతీయ పార్టీలు గెలుచుకునే సీట్లన్ని నరేంద్ర మోడీకి ఉపయోగపడుతున్నాయని చెప్పారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 2014లో 11, 2019లో 9 ఎంపీ సీట్లు గెలిచారనీ, ప్రధాని నరేంద్ర మోడీ తెచ్చిన ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ, నోట్ల ఉపసంహరణ, రైతు వ్యతిరేక బిల్లులకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతి దశలోనూ కేసీఆర్ కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారుకు మద్దతుగా నిలిచారని అన్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల చీలికకు అవకాశం ఇవ్వవద్దనీ, జాతీయస్థాయిలో లౌకిక ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్రైస్తవ మైనార్టీలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మెదక్ డయాసిస్ బిషప్ పద్మారావు, రెవరెండ్ జాన్ జార్జ్, డాక్టర్ ఏఎమ్‌జే కుమార్, శ్యామ్ అబ్రహం, అనిల్ థామస్‌తో పాటు వివిధ చర్చిలకు చెందిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, ఇండిపెండెంట్ చర్చిల ప్రతినిధులు ఉన్నారు. చర్చిల ఆస్తుల ఆక్రమణ సహా పలు సమస్యలను వారు ముఖ్యమంత్రికి వివరించారు. వీటి పరిష్కారంపై సీఎం సానుకూలంగా స్పందించారు.