
నవతెలంగాణ – పెద్దవంగర
ప్రభుత్వ పాఠశాలలను నిలబెడుదామని, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్డు సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో ఎంఈవో గుగులోత్ రాము అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 27వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వాటిలో 21లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. వీటిని అభివృద్ధి చేస్తే మరో 20 లక్షల మంది విద్యార్థులకు చదువు చెప్పవచ్చన్నారు. ప్రతి తరగతికి గది, ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు, సర్వీస్ పర్సన్, తరగతుల నిర్వహణకు ఇద్దరు టీచర్లు ఉండాలన్నారు. అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ఏం చేస్తే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతారో అధ్యయనం చేసి విద్యాశాఖకు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. కలెక్టర్ చొరవ తీసుకుని సమభావన సంఘాల మహిళలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు పంపించడం లేదని డీఆర్డీఏ అధికారుల ద్వారా తెలుసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడి నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతీ ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆగిపోయిన బదిలీలు పదోన్నతులు ప్రక్రియను వెంటనే కొనసాగించాలన్నారు. పెండింగ్ లో ఉన్న డీఏ లను విడుదల చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు 1, 2 తేదీల్లోనే జీతాలు చెల్లించాలని కోరారు. కేజీబీవీ, సమగ్రశిక్షలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, సీఆర్పీ లకు కనీస వేతనాలు చెల్లించాలన్నారు. మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు చేపట్టాలని, కేజీబీవీ, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల నోడల్ ప్రధానోపాధ్యాయుడు బుధారపు శ్రీనివాస్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ ఎంపీడీవో వేణుమాధవ్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎర్ర వెంకన్న టి పి టి ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సోమవారం ఐలయ్య మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్, టీపీయూఎస్ మండల ప్రధాన కార్యదర్శి మధుసూదన్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభాకర్, అజయ్, చింతల సురేష్, రమేష్, మురళి, సత్యనారాయణ, కేజీబీవీ ఎస్ఓ గంగారపు స్రవంతి, సీఆర్పీ లు వేముల సంతోష్, రంగన్న, 317 జీవో బాధిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.