బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి మేఘనారెడ్డికి సీఎం అభినందన

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బ్యాడ్మింటన్‌ ఇంటర్నేషనల్‌ ఛాలెంజ్‌-2024 పోటీల్లో కాంస్యపతకం సాధించిన మేఘనారెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో అభినందించారు. దేశం గర్వించేలా మరిన్ని పతకాలు సాధించాలని ఆశీర్వదించారు. మేఘనా రెడ్డి స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా. మేఘన తండ్రి రవీందర్‌ రెడ్డి డీఎస్పీగా పనిచేస్తున్నారు, తల్లి శ్యామలత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ప్రస్తుతం మేఘనా మెహదీపట్నంలోని సెయింట్‌ ఆన్స్‌ కళాశాలలో బీఏ డిగ్రీ చదువుతున్నది. ప్రస్తుతం ఆమె ఖేలో ఇండియా పథకం కింద బెంగళూరులోని ప్రకాష్‌ పదుకొనే బ్యాడ్మింటన్‌ అకాడమీలో బ్యాడ్మింటన్‌ శిక్షణ పొందుతున్నది.
ఆమె అండర్‌-13, అండర్‌-15 కేటగిరీలతో పాటు అన్ని వయసుల విభాగాల్లో భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచింది. మేఘన ఇప్పటివరికి మొత్తం 32 దేశీయ, అంతర్జాతీయ పతకాలు పొందింది. గతంలో ఆమె ఉగాండా అంతర్జాతీయ సిరీస్‌-2023లో బంగారు పతకం, కంపాలా ఇంటర్నేషనల్‌-2023లో వెండి పతకం, బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ సిరీస్‌ 2023లో కాంస్య పతకం, ఇన్ఫోసిస్‌ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌-2024లో కాంస్య పతకం, జాతీయ క్రీడలు- 2023 గోవాలో కాంస్య పతకాలు సాధించింది.