– ఐపీఎల్‌లో భారత క్రికటర్లపై గంగూలీ
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భారత క్రికెటర్లు బంగారంతో సమానమని ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ అన్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ రాకతో ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో నూతన ఉత్సాహం రానుందని ఆయన అన్నాడు. ‘రిషబ్ పంత్ రాక ఢిల్లీ క్యాపిటల్స్ కొండంత బలం. ఎందుకంటే ఐపీఎల్‌లో భారత క్రికెటర్లు బంగారం. పంత్ ఏడాదికిపైగా క్రికెట్ ఆడకపోయినా వేగంగా ఊపందుకుంటాడని అనుకుంటున్నా. పునరాగమనం కోసం పంత్ ఎంతగానో శ్రమిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్, భారత్‌కు రీ ఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తున్నాడు. ఈ సీజన్‌లో రిషబ్ పంత్ జోరు చూపిస్తాడని అనుకుంటున్నాను. మహిళల ప్రీమియర్ లీగ్ ఆరంభం సందర్భంగా బెంగళూర్‌లో పంత్‌ను కలిశాను. ఐపీఎల్ సహా భారత క్రికెట్ పునరాగమనంతో ఆసక్తితో ఉన్నాడు. ఇది ఢిల్లీ క్యాపిటల్స్, భారత క్రికెట్‌కు శుభ పరిణామం’ అని సౌరవ్ గంగూలీ అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, ఆ జట్టు ఈ సీజన్‌లో తొలి రెండు సొంత గడ్డ మ్యాచులను వైజాగ్‌లో ఆడనున్న సంగతి తెలిసిందే.