పరీక్షల పట్ల అప్రమత్తండా ఉండాలి

– అవాంఛనీయ సంఘటనలను నిరోధించాలి
– కాలేజీలు, పరీక్షా కేంద్రాల వద్ద టోల్‌ ఫ్రీ నెంబర్లుండాలి
– ఇంటర్‌ బోర్డు అధికారులకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలను సమర్థవంతంగా, ప్రశాంతంగా నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు అధికారులను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశించారు. ఈ పరీక్షల నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా, పరీక్షల నియంత్రణ అధికారి జయప్రదబాయి, డీఐఈవోలు, నోడల్‌ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పరీక్షలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ జిల్లాల స్థాయిలో అవాంఛనీయ సంఘటనలను నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెలీమానస్‌ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 14416 లేదా 1800-914416 నెంబర్లకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. పరీక్షా కేంద్రాలు, కాలేజీల వద్ద ఆ నెంబర్లను అందుబాటులో ఉంచాలని కోరారు. ఆదిలాబాద్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉన్న ఫిర్యాదుల కంట్రోల్‌ రూం హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 040-24655027తోపాటు జిల్లా కంట్రోల్‌ రూమ్‌లను సంప్రదించాలని సూచించారు. పరీక్షలను కాలేజీల ప్రిన్సిపాళ్లు అప్రమత్తంగా నిర్వహించాలని కోరారు.
విద్యార్థులు, అధ్యాపకులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రెండోరోజు 13,085 మంది గైర్హాజరు
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు గురువారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు గురువారం సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్షను నిర్వహించామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు 4,55,536 మంది దరఖాస్తు చేయగా, 4,42,451 (97.13 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. రెండోరోజు 13,085 (2.87 శాతం) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఖమ్మంలో ఒకరిపై మాల్‌ప్రాక్టీస్‌ కేసును నమోదు చేశామని తెలిపారు. ఇంటర్‌ సెకండియర్‌ సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్షకు సెట్‌ ఏ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశామని వివరించారు. జోగులాంబ గద్వాల, కామారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో ఇంటర్‌ బోర్డు నుంచి పరిశీలకులు వెళ్లి పరీక్షను పరిశీలించారని తెలిపారు. ఈ పరీక్ష ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జరిగిందని పేర్కొన్నారు.