ప్రజాసంస్కృతి విస్తరణకు ఎన్‌.శంకర్‌ కృషి ప్రశంసనీయం

– తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, అంబేద్కర్‌, ఫూలేపై వెబ్‌సిరీస్‌లు తేవడం గొప్ప విషయం : అభ్యుదయ ఆర్ట్స్‌ అకాడమీ ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గరాజు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సాంస్కృతికరంగంలో ప్రజా సంస్కృతి విస్తరణకు సినీ దర్శకులు ఎన్‌.శంకర్‌ చేస్తున్న కృషి అభినందనీయమనీ, సాంస్కృతికంగా ఆయన చేస్తున్న పోరాటానికి తాము సంఘీభావం తెలుపుతున్నామని అభ్యుదయ ఆర్ట్స్‌ అకాడమీ ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గరాజు, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం నాయకులు భూపతి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు గురువారం ఎన్‌.శంకర్‌కు జగ్గరాజు లేఖ రాశారు. తెలంగాణ, అంబేద్కర్‌, ఫూలే వెబ్‌సిరీస్‌లు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దేశ చరిత్రలోనే నిలిచి పోయిందనీ, ఆ పోరాటంలో నాలుగు వేల మందికిపైగా వీరమరణం పొందారని గుర్తుచేశారు. దొరలు, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా జరిగిన ఆ మహత్తర పోరాటం ద్వారా పేదలకు 11 లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టులు పంచారని తెలిపారు. ఆ పోరాటంతో ఏమాత్రం సబంధంలేని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు దాన్ని హిందూ-ముస్లిం మధ్య జరిగిన గొడవగా చూపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ప్రజల మెదళ్లలో తప్పుడు ఆలోచనలు జొప్పించేలా కొన్ని శక్తులు సినిమాలు తీస్తున్న ఈ సమయంలో శంకర్‌ వెబ్‌ సిరీస్‌లు తేవడానికి పూనుకోవడం మంచి నిర్ణయమని అభినందిం చారు. మనువాద సంస్కృతిని మెజార్టీ మతోన్మాదంగా దేశంపై రుద్దుతున్న శక్తులకు జవాబు చెబుతూ జ్యోతిబాఫూలే, అంబేద్కర్‌లను నేటి తరానికి సోదాహరణంగా పరిచయడం చేయాలనుకోవడం మంచి పరిణామని తెలిపారు. వీరతెలంగాణ పోరుగడ్డ నల్లగొండ జిల్లా బిడ్డగా శంకర్‌ సాయుధ పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతారని ఆకాంక్షించారు. అంబేద్కర్‌ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ‘సంఘం శరణం గచ్చామి’ పేరుతో అంబేద్కర్‌పై నాటకాన్ని రూపొందించి ఎనిమిదేండ్లుగా 660 ప్రదర్శనలు చేశామనీ, ‘సత్యశోధన’ పేరుతో ఫూలే జీవితంపై 60 ప్రదర్శనలు, ‘యోగి వేమన” నాటకాన్ని 60 చోట్ల ప్రదర్శించామని వివరించారు. ‘బుద్ధునితో నా ప్రయాణం’ అనే పేరుతో బౌద్ధం సారాంశాన్ని నాటకంగా మలిచే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు.