– 11,062 పోస్టులతో నోటిఫికేషన్.. హైదరాబాద్లో అత్యధికం, పెద్దపల్లిలో అత్యల్పం
– విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి
– ఆన్లైన్లో 11 కేంద్రాల్లో రాతపరీక్షలు
– 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ
– తుది గడువు ఏప్రిల్ 3
– గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేయొద్దు
– అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మెగా నోటిఫికేషన్ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతోపాటు విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్ ఆరో తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం విడుదల చేయగా, 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. కాగా ప్రస్తుత ప్రభుత్వం పాత డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేసిన సంగతి విదితమే. గత ప్రభుత్వం ప్రకటించిన 5,089 పోస్టులకు అదనంగా 4,957 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ గతనెల 26న ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్లో 796 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), 220 స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) కలిపి మొత్తం 1,016 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గతనెల 26న అనుమతినిచ్చింది. దీంతో 11,062 ఉపాధ్యాయ పోస్టులతో రాష్ట్ర ప్రభుత్వం మెగాడీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్లో అత్యధికంగా 878 పోస్టులున్నాయి. ఇక అత్యల్పంగా పెద్దపల్లిలో 93 పోస్టులున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మహిళలకు సమాంతర రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) మార్గదర్శకాల ప్రకారం ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే బీఎడ్ అభ్యర్థులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
జూన్ లేదా జులైలో డీఎస్సీ రాతపరీక్షలు
మెగా డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్లో ఈనెల నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానుంది. వాటి సమర్పణకు వచ్చేనెల మూడో తేదీ వరకు గడువున్నది. ఈనెల నాలుగు నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు అవకాశమున్నది. దరఖాస్తు ఫీజు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే డీఎస్సీకి దరఖాస్తు చేసే అభ్యర్థుల వయోపరిమితిని ప్రభుత్వం సడలించింది. కనిష్ట వయోపరిమితి 18 నుంచి గరిష్ట వయోపరిమితి 46 ఏండ్ల వరకు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేండ్లు, మాజీ సైనికులకు మూడేండ్లు, ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేండ్లు, వికలాంగులకు పదేండ్లపాటు సడలింపునిస్తున్నట్టు ప్రకటించింది. ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీఆర్టీ)ను నిర్వహించాలని నిర్ణయించింది. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి కేంద్రాల్లో రాతపరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించింది. అభ్యర్థులు ప్రాధాన్యతల వారీగా పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలని సూచించింది. రాతపరీక్షల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది. విద్యార్హతలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సిలబస్, కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు సమాచార బులెటిన్లో ఉంటాయని వివరించింది. ఇతర వివరాలకు https://schooledu.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాల్సి ఉంటుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం జూన్ లేదా జులైలో డీఎస్సీ రాతపరీక్షలను నిర్వహించే అవకాశమున్నది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కోడ్ ముగిసిన తర్వాతే రాతపరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలిసింది.
ఉపాధ్యాయ పోస్టుల వివరాలు
కేటగిరీ పోస్టులు
స్కూల్ అసిస్టెంట్ 2,629
ఎస్జీటీ 6,508
పండితులు 727
పీఈటీలు 182
మొత్తం 10,046
స్పెషల్ ఎడ్యుకేషన్
స్కూల్ అసిస్టెంట్ 220
ఎస్జీటీ 796
మొత్తం 1,016
మొత్తం పోస్టులు 11,062