వేతనం కోసం వెతలు..

ప్రతి నెలా వేతనం ఒక్కో జీపీ నుంచి కేటాయిస్తున్నారు. నిధులు లేక వేతనం సకాలంలో చేతికందడం లేదు. రాష్ట్రం మొత్తంగా ఒకే రకంగా పనిచేస్తున్నాం. వేతన చెల్లింపుల్లో మాత్రం తేడా ఉండటం అన్యాయం. తక్కువ స్థాయి వేతనంతో కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే నేరు వేతనం చెల్లించాలి.
– మాలోత్‌ సందీప్‌, నల్లగొండ జిల్లా అధ్యక్షులు
జీవో 60 ప్రకారం కనీసం వేతనం చెల్లించాలి
     తొమ్మిదేండ్లగా ఈ-పంచాయతీలో డేటా ఆపరేటర్లుగా పనిచేస్తున్నాం. కనీస వేతనం అందక సతమవు తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జీవో 60 ద్వారా కనీస వేతనం ఇవ్వాలని ఉత్తర్వులు జారీచేసింది. పంచాయతీరాజ్‌ శాఖలో మాత్రం పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. కేవలం 11 జిల్లాల్లో మాత్రమే అమలు చేస్తున్నారు. మిగతా జిల్లాల్లో తక్కువ వేతనం ఇస్తున్నారు. పూర్తి స్థాయి ఉద్యోగులుగా పనిచేస్తూ పనిభారంతో సతమతమవుతున్నాం. ఉద్యోగ భద్రత కల్పించాలి. బీమా, పీఎఫ్‌, హెల్త్‌ కార్డులు వంటి సౌకర్యాలు కల్పించాలి.
– గడ్డం శేషాద్రి, ఈ-పంచాయతీ ఆపరేటర్ల అధ్యక్షులు పని భారంతో ఈ-పంచాయతీ ఆపరేటర్లు
– భద్రత లేని ఉద్యోగం.. అరకొర వేతనంతో సతమతం
– ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాలని డిమాండ్‌
నవతెలంగాణ-నర్సంపేట
   పంచాయతీరాజ్‌ వ్యవస్థ శక్తివంతంగా ఏర్పడటంలో.. ప్రజలకు పారదర్శకంగా జవాబుదారీతనం పెంచడంలో.. సాంకేతిక సమాచార వ్యవస్థతో సత్వర సేవలను ప్రజలకు అందించడంలో ఈ పంచాయత్‌ ఆపరేటర్ల పాత్ర ముఖ్యమైనది. కానీ వారు ఏండ్ల తరబడి పనిభారంతో సతమతమవుతూ చాలీచాలనీ వేతనాలతో వెతలు పడుతున్నారు. ఆపరేటర్ల ఉద్యోగానికి భద్రత లేకుండా పోయింది.. తొమ్మిదేండ్ల క్రితం కార్వీ అనే ఏజన్సీ ద్వారా రాష్ట్రంలోని 2240 క్లస్టర్‌ గ్రామ పంచాయతీలకు 1140 మంది ఈ- పంచాయతీ డేటా ఎంట్రీ ఆపరేటర్లు నియమితులయ్యారు.
ఒప్పందం గడువు ముగిసినా తదుపరి వీరి సేవలు అనివార్యం కాగా పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు కొనసాగించడానికి ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొక్కరికి 8 నుంచి 10 గ్రామ పంచాయతీలకుపైగా రాష్ట్రంలోని 12,753 గ్రామ పంచాయతీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను అమలు చేయడంలో పనిచేస్తున్నారు. వేతన చెల్లింపుల్లో మాత్రం జిల్లాకో తీరు అమలవుతుంది. కేవలం 11 జిల్లాల్లో మాత్రమే జీవో 60 ప్రకారం రూ.22,750 అమలవుతోంది. మిగతా 20 జిల్లాల్లో జిల్లాకో తీరుగా తక్కువ వేతనం ఇస్తున్నారు. పని భారం విపరీతంగా పెరిగి తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆపరేటర్లు వాపోతున్నారు. జీపీల్లో నిధులు కొరవడ్డాయి.. 15 ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ల నుంచి నిధులు ఎప్పుడు విడుదలవుతాయో తెలియని పరిస్థితి ఉంది. వేతనం కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని.. ఈ తరణంలో పెరిగిన ధరలతో చాలీచాలనీ వేతనంతో కుటుంబ పోషణ కష్టతరంగా మారిందని ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచే నేరుగా వేతనాలకు బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
పనిభారం ఇలా. సమయపాలన లేని ఉద్యోగం..
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాలు, 30 రోజుల ప్రణాళిక (1,2), పల్లె ప్రగతి, హరితహారం, జనన-మరణ ధృవీకరణలు, భవన నిర్మాణం – ఆస్థి మార్పిడి, వ్యాపార లైసెన్సులు, ప్లాన్‌ప్లస్‌, ఈ గ్రామ్‌ స్వరాజ్‌, ఆస్తుల జియో ట్యాగ్‌, లోకల్‌ గవర్నమెంట్‌ డైరెక్టరీ, పంచాయతీ కార్యదర్శుల ప్రతి నెల యాక్టివిటీ, పీఎఫ్‌ఎంఎస్‌, జీపీల అభివృద్ధి పనులకు సంబంధించి 11 రకాల అప్లికేషన్లు, ఆదాయవ్యయాలను ఎప్పటికప్పుడు కంప్యూటీకరణ చేయాల్సి ఉంటుంది. ఇలా విధులు నిర్వహిస్తూనే ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పింఛన్‌ల నమోదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌లు, దీపం పథకం, ఐఐహెచ్‌ఎల్‌ (స్వచ్చ్‌ భారత్‌) ఆన్‌లైన్‌ పనులను తూచా తప్పకుండా ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేయాలి. 2019 సాధారణ ఎన్నికల్లో సర్పంచ్‌, ఎంపీటీసీ ఎన్నికల విధులు నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శుల విధులు, చేపడుతున్న పనులకు సంబంధించి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తూ పంచాయతీ రాజ్‌ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇంతటి పనిభారం తమపై మోపుతూ చాలీచాలనీ వేతనాలను ఇవ్వడం ఎంతవరకు సమంజసమనిఆపరేటర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఒకే కేటగిరీలో పనిచేస్తున్న ఆపరేటర్లందరికీ జీవో ఎంఎస్‌ నెంబర్‌ 60 ప్రకారం మూడు కనీస వేతనం రూ.22,750 వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించడానికి నేరుగా ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని, ప్రసూతి సెలవులు, ఫీఎఫ్‌, ఈహెచ్‌ఎస్‌ వర్తింపజేయాలని కోరుతున్నారు.