తాడిచెర్ల పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసం.?

– ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు ఎవరిని వరించునో.?
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘము వైస్ ఛైర్మన్ మల్కా ప్రకాష్ రావుపై సింగిల్ విండో డైరెక్టర్లు బొమ్మ రమేష్ రెడ్డి,సుంకు రాము,మాచెర్ల సురేష్ తదితరులు అవిశ్వాసం పెట్టేందుకు ప్రత్యేక ప్రణాళికల తయారు చేసుకొని శుక్రవారం అవిశ్వాస తీర్మానం పత్రాన్ని భూపాలపల్లి డిఎస్ఓ శైలజ కు అందజేశారు. నిన్న పీఏసీఎస్  ఛైర్మన్ చెప్యాల రామరావుపై కొందరు డైరెక్టర్లు, నేడు వైస్ ఛైర్మన్ మల్కా ప్రకాష్ రావుపై మరికొందరు వెనువెంటనే అవిశ్వాలు పెట్టడంపై మండలంలో రాజకీయపరిణామాలు రసవోత్తరంగా మారాయి. దీంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు ఎవరిని వరించునో.? అనే ఉత్కంఠ నెలకొంది.
ఇంకా ఏడాది కాలం: ఫిబ్రవరి 15-2020న పీఏసీఎస్ ఎన్నికలు జరుగగా 13మంది డైరెక్టర్లు ఎన్నికయ్యారు.రామారావు,ప్రకాష్ రావు లు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు ఛైర్మన్ పదవులు చేపట్టారు. ఛైర్మన్ పదవీకాలం ముగియడానికి ఇంకా ఏడాది కాలం ఉండడంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాగైనా పీఏసీఎస్ పీఠాన్ని కాంగ్రెస్ నాయకులు తమ ఖాతాలో వేసుకోవడానికి పలుమార్లు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ డైరెక్టర్ల మద్దతుతో రహస్యంగా భేటియై కాంగ్రెస్ డైరెక్టర్లకు బీఆర్ఎస్ డైరెక్టర్లు మద్దతు ఇచ్చేలా ఒకతాటిపైకి తీసికొచ్చినట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసం పెట్టడం దేనికి దారితిస్తుందో వేచి చూడలసిందే. పీఏసీఎస్ ఛైర్మన్ పదవీకాలం మరో ఏడాది ఉండగా కాంగ్రెస్ కు చెందిన డైరెక్టర్లలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్  పదవులు ఎవరిని వరిస్తాయో అనే ఉత్కంఠ కొనసాగుతోంది.