బీసీ విదేశీ విద్య స్కాలర్షిప్‌ నిధులు విడుదల చేయాలి

– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ చిన్నారెడ్డికి ఎంపీ ఆర్‌ కృష్ణయ్య వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీసీ విదేశీ విద్య స్కాలర్‌షిప్‌ నిధులను విడుదల చేయాలని రాజ్య సభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ జి. చిన్నారెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థులకు సంబంధించిన పలు అంశాలపై చిన్నారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. వారికి అందజేస్తున్న విదేశీ విద్య స్కాలర్‌షిప్‌ల సంఖ్యను 300 నుంచి కనీసం 1000 మందికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 11 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో బీఇడీ, డీఇడీ పూర్తిచేసిన సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులకు టెట్‌ పరీక్షలు నిర్వహిం చాలని కోరారు. అందుకోసం నోటిఫికేషన్‌ జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాల న్నారు. టెట్‌ పరీక్ష పాస్‌ అయితే తప్ప డీఎస్సీ పరీక్షకు అర్హత ఉండదని ఆయన గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ విద్యార్థులకు గత మూడేండ్ల నుంచి ఫీజు రియంబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం మంజూరు చేయడం లేదని తెలిపారు. దీంతో ఫీజులు చెల్లించాలంటూ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచు తూ వేధింపులకు గురి చేస్తున్నారని వివరించారు. మూడేండ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ. 4వేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్‌బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ భేటీలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్‌, అనంతయ్య, రాజేందర్‌, రామకృష్ణ, రాజు పాల్గొన్నారు.